వందేళ్ల దుర్భిక్షం..!
♦ తెలంగాణ, ఏపీల్లో తీవ్ర స్థాయిలో నీటి కరువు
♦ కృష్ణా బేసిన్‌లో వందేళ్ల క్రితం నాటి దుర్భర పరిస్థితి
♦ తెలంగాణ, ఏపీలకు కేటాయింపులు 811 టీఎంసీలు... వినియోగం 100 టీఎంసీలే
♦ అందులో తెలంగాణ వాడకం 31.67, ఏపీ వినియోగించినది 68.37 టీఎంసీలు
♦ వినియోగానికి వీలుగా ఉన్న నీరు మరో 40 టీఎంసీలే
♦ నీటి ప్రాజెక్టులపై కేంద్రానికి కృష్ణా బోర్డు నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాల సాగు, తాగు అవసరాలను తీరుస్తున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కష్టకాలం వచ్చింది. వాటిల్లో ఈ ఏడాది వందేళ్ల దుర్భిక్షం నెలకొంది. ఇరు రాష్ట్రాలకు కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీల మేర కేటాయింపులు ఉండగా... అందులో ఈ ఏడాది వినియోగమైన నీరు 100 టీఎంసీలను మించలేదు. తెలంగాణకు ఉన్న వాస్తవ నీటి కేటాయింపు సుమారు 300 టీఎంసీల్లో ఈ ఏడాది నికరంగా దక్కింది కేవలం 31 టీఎంసీలేనని కృష్ణా నది యాజమాన్య బోర్డు తేల్చింది. ఇరు రాష్ట్రాల్లో నీటి లభ్యత, వినియోగంపై బోర్డు కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘాలకు నివేదికను సమర్పించింది.
అందులో ఇరు రాష్ట్రాలు ఇప్పటివరకు వినియోగించుకున్న నీటి లెక్కలను పేర్కొంది. లభ్యమైన నీరు తక్కువగా ఉన్నందున ఇరు రాష్ట్రాలు కూడా సాగు అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోయాయని... నవంబర్ మొదలైన దృష్ట్యా ఆశించిన స్థాయిలో కొత్తగా నీరొస్తుందన్న ఆశలు కూడా లేవని స్పష్టం చేసింది.
చాలా తక్కువ
కృష్ణా బేసిన్‌లో తెలంగాణ, ఏపీలకు కలిపి 811 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు వాటా ఉంది. ఈ నీటితోనే ఇరు రాష్ట్రాల్లో సుమారు 50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు, కోటిన్నర జనాభా తాగు అవసరాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ ఏడాది బేసిన్ పరిధిలో వర్షాభావం కారణంగా జూన్ నుంచి ఆగస్టు చివరి వరకు చుక్కనీరు కూడా ప్రాజెక్టుల్లోకి రాలేదు. సెప్టెంబర్ తర్వాత తుంగభద్రలో కొంతమేర నీరు రాగా... కృష్ణాలోని జూరాల, శ్రీశైలానికి కొద్దిపాటి ప్రవాహాలు మాత్రమే వచ్చాయి.
అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టుల కింద వచ్చిన మొత్తం నీటిలో ఇరు రాష్ట్రాల వినియోగం 100 టీఎంసీలకే పరిమితమైంది. బోర్డు తేల్చిన లెక్కల ప్రకారం తెలంగాణ 31.67 టీఎంసీలు, ఏపీ 68.37 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఇందులో తెలంగాణ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 27 టీఎంసీలు, చిన్నతరహా ప్రాజెక్టుల కింద 4.75 టీఎంసీలు వాడుకున్నట్లుగా తేల్చింది. ఇక ఏపీ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో కలిపి 68.37 టీఎంసీలను వాడుకున్నట్లుగా గుర్తించింది. అసలు ఇంత తక్కువగా నీటి లభ్యత కొన్నేళ్లలో ఎన్నడూ లేదని బోర్డు నిర్ధారించింది.
అత్యంత కరువు ఉన్న 2002-03, 03-04లోనూ నీటి వినియోగం 100 టీఎంసీలకు మించి ఉందని, ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితులు కూడా లేవని తెలిపింది. కృష్ణా బేసిన్‌లోని కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులుండగా... సుమారు 570 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీల వాటా ఉండగా 320 టీఎంసీల నీరు వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే వినియోగించుకున్న 100 టీఎంసీలతో పాటు లభ్యతగా మరో 40 టీఎంసీల మేర జలాలున్నాయి. మొత్తంగా కలుపుకొన్నా బేసిన్ మొత్తంలో వెయ్యి టీఎంసీలకు దగ్గరగా మాత్రమే ఉంది. గతంలో వందేళ్ల కిందట 1918-19లో మాత్రమే అత్యంత కనిష్టంగా 1,007 టీఎంసీల నీరు వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని బోర్డు తేల్చింది.