భార్యను అడవిలో వదిలేశాడు
కాసిపేట(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కుర్రెఘడ్ పునరావాస కాలనీకి చెందిన టేకం సోనెరావు తన భార్య గంగుబాయిని గత ఆదివారం తీవ్రంగా కొట్టి అడవిలో వదిలిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవాపూర్ ఏఎస్సై సుకుమార్ కథనం ప్రకారం.. సోనెరావు అనుమానంతో భార్య గంగుబాయిని తీవ్రంగా కొట్టి పాత తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఎవరికి చెప్పక పోవడంతో మూడు రోజులుగా గంగుబాయి కనిపించడం లేదని ఆమె బంధువులు మంగళవారం రాత్రి దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బుధవారం పోలీసులు గ్రామస్తులను విచారించగా అనుమానంతో సోనెరావు తరచూ భార్యను కొడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పాత తిరుమలాపూర్ గ్రామస్తులు శివారు అటవీ ప్రాంతంలో గంగుబాయి అనే మహిళ కనిపించినట్లు సమాచారం అందించడంతో పోలీసులు తిరుమలాపూర్ వెళ్లారు. అక్కడి బంధువుల ఇంట్లో గంగుబాయి ఉన్నట్లు తెలుసుకుని ఆమెను తీసుకొచ్చారు.
అయితే గంగుబాయి ఆదివారం రాత్రికే బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకుంది. ఆమెకు దేవాపూర్ డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స చేయించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సోనెరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.