Kasipet
-
కొడుకు రాసిన మరణశాసనం
తాండూర్: ఆన్లైన్ ట్రేడింగ్ ఆ ఇంటిల్లిపాది పాలిట మృత్యుపాశమైంది. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే కుమారుడి అత్యాశ.. కుటుంబం బలవన్మరణానికి కారణమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం, అప్పులు అధికం కావడం, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకొని తాగిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంలో శివప్రసాద్(26)తోపాటు తల్లిదండ్రులు మొండయ్య(58), శ్రీదేవి(52), అక్క చైతన్య అలియాస్ చిట్టి(30) ఒక్కొక్కరుగా గంటల వ్యవధిలో నలుగురూ బుధవారం మృతిచెందారు.యూట్యూబ్‌కు ఆకర్శితుడై..శివప్రసాద్ బెల్లంపల్లిలో కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ వైపు ఆకర్శితుడయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. తొలుత కాస్త లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరుసగా నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడంతో వడ్డీలు పెరిగి భారమయ్యాయి.రూ.50 లక్షలకు పైగా..అప్పులు పెరిగిపోవడంతో ఏడాది క్రితం కొంతకాలం శివప్రసాద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో అప్పులు రూ.50లక్షలకు పైగా పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల పేరుతో మరికొంత అప్పు చేయడంతో మోయలేని భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.వైకల్యం నుంచి శాశ్వత నిద్రలోకి..చైతన్య పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. మరొకరి సాయం ఉంటే గానీ జీవనం సాగించలేని పరిస్థితి కావడంతో దగ్గరుండి చూసుకునేవారు. తామందరం లేకుండా కూతురు ఎలా జీవిస్తుందోనని, చివరికి ఆమె ఎవరికి భారం కాకూడదని ఆలోచించిన తల్లిదండ్రులు తమతోపాటే గడ్డిమందు తాగించి పేగుబంధాన్ని వెంట తీసుకెళ్లారు.గ్రామంలో విషాదఛాయలుమొండయ్య కుటుంబమంతా మృతిచెందడంతో కాసిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. మొండయ్య చిరు వ్యాపారంతోపాటు ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు విక్రయించడంతో అందరికీ సుపరిచితుడయ్యాడు. అందరితో కలిసిమెలిసి ఉండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నేరుగా కాసిపేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేయాలని బంధువులు నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలకు తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. కాగా, మృతుడు శివ ప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భార్యను అడవిలో వదిలేశాడు
కాసిపేట(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కుర్రెఘడ్ పునరావాస కాలనీకి చెందిన టేకం సోనెరావు తన భార్య గంగుబాయిని గత ఆదివారం తీవ్రంగా కొట్టి అడవిలో వదిలిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవాపూర్ ఏఎస్సై సుకుమార్ కథనం ప్రకారం.. సోనెరావు అనుమానంతో భార్య గంగుబాయిని తీవ్రంగా కొట్టి పాత తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఎవరికి చెప్పక పోవడంతో మూడు రోజులుగా గంగుబాయి కనిపించడం లేదని ఆమె బంధువులు మంగళవారం రాత్రి దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం పోలీసులు గ్రామస్తులను విచారించగా అనుమానంతో సోనెరావు తరచూ భార్యను కొడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పాత తిరుమలాపూర్ గ్రామస్తులు శివారు అటవీ ప్రాంతంలో గంగుబాయి అనే మహిళ కనిపించినట్లు సమాచారం అందించడంతో పోలీసులు తిరుమలాపూర్ వెళ్లారు. అక్కడి బంధువుల ఇంట్లో గంగుబాయి ఉన్నట్లు తెలుసుకుని ఆమెను తీసుకొచ్చారు. అయితే గంగుబాయి ఆదివారం రాత్రికే బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకుంది. ఆమెకు దేవాపూర్ డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స చేయించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సోనెరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
ఉరి వేసుకుని వివాహిత బలవన్మరణం
కాసిపేట (ఆదిలాబాద్) : జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత బలవన్మరణం చెందింది. ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం తుమ్మగూడెం తండాకు చెందిన బానోతు గోపాల్ భార్య మీనాక్షి (22) రెండు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాగా పసికందు కొద్దిరోజులకే మృతిచెందింది. అప్పటి నుంచి మీనాక్షి తీవ్ర మనోవేదనతో ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించేసరికే ఆమె చనిపోయింది. -
ఇద్దరు చిన్నారులు అదృశ్యం
ఆదిలాబాద్: పెళ్లికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కాశీ పేట మండలం ధర్మారావుపేట గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఒక పెళ్లికి సంతోష్(8), విజయ్(8) వెళ్లారు. అలా వెళ్లిన పిల్లలు తెల్లవారినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. అయినా వారి ఆచూకి తెలియకపోవడంతో పోలీసులను సంప్రదించారు. కేసు నమోదు చేసుకొని పిల్లల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (కాశీపేట) -
ఓసీ సర్వేపై సమావేశం రసాభాస
కాసిపేట :కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామంలో ఓపెన్‌కాస్టు(ఓసీ) సర్వేపై సోమవారం గ్రామస్తులతో అధికారులు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఓపెన్‌కాస్టు నిర్మాణంతో గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతుందని, ఓసీ కోసం తలపెట్టిన సర్వేలు నిలిపివేయాలని, లేనిపక్షంలో సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరిస్తామని గ్రామస్తులు ఇటీవల తీర్మాణం చేసిన విషయం తెలిసిందే. ఆర్డీవో స్వయంగా ఓసీ సర్వే నిలిపివేస్తామని హామీ ఇస్తేనే సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో సోమవారం గ్రామంలో మంచిర్యాల ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి ఏరియా జీఎం మల్లిఖార్జునరావు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఓపెన్‌కాస్టు సర్వేలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకే ఓసీ కోసం సర్వేలు చేస్తున్నామని ఆర్డీవో, జీఎంలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఓసీ మంజూరైనందున ప్రస్తుతం సర్వేలు చేపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. ఎన్నికల వేళ ఓసీలకు వ్యతిరేకమని, భూగర్భ గనులకు ప్రాధాన్యం ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి తోపులాటకు దారితీసింది. సమావేశం రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇకపై సర్వేలు ఉండవు.. : ఎమ్మెల్యే కలెక్టర్, ముఖ్యమంత్రితో మాట్లాడి ఓసీని అడ్డుకుంటామని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఓసీ సర్వేలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించినట్లు, ఇకపై సర్వేలు ఉండవని పేర్కొన్నారు. సర్వే నిలిపివేస్తున్నట్లు అధికారులతో చెప్పించారు. సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. తహశీల్దార్ కవిత, కాసిపేట సర్పంచ్ నీల రాంచందర్, ఎంపీపీ ముదం శంకరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు రౌతు సత్తయ్య, బెల్లంపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, వైస్ ఏంపీపీ లౌడ్య బలరాం, ఏంపీటీసీలు కొండబత్తుల సంధ్య, దాసరి శ్రీనివాస్, దుర్గం లక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీధర్‌రావు, మండల అధ్యక్షుడు రమణారెడ్డి, యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ, ప్రజాస్పందన వేదిక కన్వీనర్ సిలోజు మురళి, సీపీఐ నాయకులు దాగం మల్లేశ్, జాడి పోశం, కల్వల లక్ష్మణ్ ఎస్టేట్ అధికారి హిరియా పాల్గొన్నారు.