ఓసీ సర్వేపై సమావేశం రసాభాస | upset on oc survey meeting | Sakshi
Sakshi News home page

ఓసీ సర్వేపై సమావేశం రసాభాస

Published Tue, Aug 19 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

upset on oc survey meeting

కాసిపేట :కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామంలో ఓపెన్‌కాస్టు(ఓసీ) సర్వేపై సోమవారం గ్రామస్తులతో అధికారులు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఓపెన్‌కాస్టు నిర్మాణంతో గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతుందని, ఓసీ కోసం తలపెట్టిన సర్వేలు నిలిపివేయాలని, లేనిపక్షంలో సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరిస్తామని గ్రామస్తులు ఇటీవల తీర్మాణం చేసిన విషయం తెలిసిందే.

ఆర్డీవో స్వయంగా ఓసీ సర్వే నిలిపివేస్తామని హామీ ఇస్తేనే సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో సోమవారం గ్రామంలో మంచిర్యాల ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి ఏరియా జీఎం మల్లిఖార్జునరావు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఓపెన్‌కాస్టు సర్వేలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకే ఓసీ కోసం సర్వేలు చేస్తున్నామని ఆర్డీవో, జీఎంలు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఓసీ మంజూరైనందున ప్రస్తుతం సర్వేలు చేపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. ఎన్నికల వేళ ఓసీలకు వ్యతిరేకమని, భూగర్భ గనులకు ప్రాధాన్యం ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి తోపులాటకు దారితీసింది. సమావేశం రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.

 ఇకపై సర్వేలు ఉండవు.. : ఎమ్మెల్యే
 కలెక్టర్, ముఖ్యమంత్రితో మాట్లాడి ఓసీని అడ్డుకుంటామని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఓసీ సర్వేలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించినట్లు, ఇకపై సర్వేలు ఉండవని పేర్కొన్నారు. సర్వే నిలిపివేస్తున్నట్లు అధికారులతో చెప్పించారు. సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని కోరారు.

తహశీల్దార్ కవిత, కాసిపేట సర్పంచ్ నీల రాంచందర్, ఎంపీపీ ముదం శంకరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు రౌతు సత్తయ్య, బెల్లంపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, వైస్ ఏంపీపీ లౌడ్య బలరాం, ఏంపీటీసీలు కొండబత్తుల సంధ్య, దాసరి శ్రీనివాస్, దుర్గం లక్ష్మి, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీధర్‌రావు, మండల అధ్యక్షుడు రమణారెడ్డి, యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ, ప్రజాస్పందన వేదిక కన్వీనర్ సిలోజు మురళి, సీపీఐ నాయకులు దాగం మల్లేశ్, జాడి పోశం, కల్వల లక్ష్మణ్ ఎస్టేట్ అధికారి హిరియా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement