
అవినీతిని సహించేది లేదు
అనంతపురం టౌన్ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎవరూ పనిచేయరాదని డీఆర్‌డీఏ–వెలుగు అధికారులకు సెర్ప్ ఇన్‌స్టిట్యూషన్ బిల్డింగ్స్ (ఐబీ) డైరెక్టర్ ఉషారాణి సూచించారు. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన చాంబర్‌లో జిల్లాలోని డీపీఎంలు, ఏరియా కో ఆర్డినేటర్లతో ఆమె వర్క్‌షాప్ నిర్వహించారు.
2009లో సెర్ప్ ఆవిర్భావం సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాలు, మానవ వనరులకు సంబంధించి విధి విధానాలను వివరించారు. ఆర్థిక క్రమశిక్షణ అవసరమని, ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.