బీసీలంటే చిన్నచూపా..
వయసుకు గౌరవం ఇవ్వకుండా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. యాదవ కులానికే పెద్దగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తిపై చేయి చేసుకున్న గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నేతలు డిమాండ్ చేశారు.
* జంగాపై చేయి చేసుకున్న డీఎస్పీని సస్పెండ్ చేయాలి
* ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల ఎదుట అఖిత భారత యాదవ మహసభ నేతల ఆందోళన
పట్నంబజారు: వయసుకు గౌరవం ఇవ్వకుండా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. యాదవ కులానికే పెద్దగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తిపై చేయి చేసుకున్న గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు కార్యాలయాల ఎదుట శనివారం డీఎస్పీని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తొలుత హిందూ కళాశాల కూడలి నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తూ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయటంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు కదలబోమని మహాసభ నేతలు తేల్చిచెప్పారు. వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా నేతలు ససేమిరా అంటూ అక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారికి అక్కడ అడ్డుకోవటంతో ఆగ్రహించిన నేతలు బీసీలంటే చిన్న చూపా.. అధికారులతో కూడా మాట్లాడనివ్వరా.. అంటూ రాస్తారోకోకు దిగేందుకు సిద్ధమయ్యారు. మరోసారి డీఎస్పీ సరిత కల్పించుకుని ముఖ్యనాయకులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పటంతో వివాదం సర్ధుమణిగింది. అనంతరం అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు, కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మహాసభ రాష్ట్ర కార్యదర్శి ఏలికా శ్రీకాంత్‌యాదవ్ మాట్లాడుతూ దేవుడిచ్చిన అన్న కోసం డీఎస్పీ నాగేశ్వరరావు పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే క్షమాపణ చెప్పించడంతో పాటు, డీఎస్పీ సస్పెండ్ చేయాలని లేని పక్షంలో జిల్లాను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు మద్దుల కోటయ్యయాదవ్ మాట్లాడుతూ డీఎస్పీపై చర్యలు తీసుకోవటంలో కనీసం అధికారుల్లో చలనం లేకుండా పోయిందన్నారు. నగరాధ్యక్షుడు ఉప్పుటూరి పేరయ్య యాదవ్ మాట్లాడుతూ పోలీసులు అధికార పక్షానికి తొత్తుల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మరో రెండు రోజుల్లో డీఎస్పీని సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని మహాసభ నేతలు స్పష్టం చేశారు.