పట్టుబడితే.. బాదుడే.!
పట్టుబడితే.. బాదుడే.!
Published Fri, Aug 5 2016 5:31 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
మర్రిపాలెం : మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ.5వేలు.. ఓవర్ లోడింగ్‌తో వెళ్తే రూ.20 వేలు.. మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేలతో పాటు వాహన యజమానికి మూడేళ్ల జైలు జీవితం.. ఇవీ త్వరలో అమల్లోకి రానున్న కొత్త రహదారి భద్రత చట్టంలో జరిమానాల జాబితా. ఇలా చట్టంలో ఉన్న జరిమానాల వివరాలు వాహనదారులను దడ పుట్టిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా మూల్యం చెల్లించక తప్పదు. రహదారి భద్రత చట్టం త్వరలో అమలులోకి రానుంది. నగరంలో ట్రాఫిక్ ఏటేటా పెరుగుతోంది. ఐదేళ్లలో వ్యక్తిగత వాహనాల వినియోగం రెట్టింపు కావడం అందుకు నిదర్శనం. ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్, రవాణా అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. రోడ్లపై కాపుగాచి చలానాలతో చావబాదుతున్నా వాహనచోదకుల తీరు మారడం లేదు. మన రక్షణ, భద్రతకే నిబంధనలు అనే అవగాహన కలగడం లేదు. ఈ నేపథ్యంలో అమల్లోకి రానున్న చట్టంలోని కఠిన నిబంధనలతో జేబులకు భారీగా చిల్లులు తప్పవని తెలుస్తోంది. నగరంలో ఏటా సుమారు 50 వేల వాహనాలు పెరుగుతుండగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలు అంతకు రెట్టింపుగా నమోదవుతున్నాయి.
పట్టని నిబంధనలు
వాహనచోదకులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖాతరు చేయడం లేదు. సిగ్నల్స్ పడక ముందు, తర్వాత రయ్..మని దూసుకుపోతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. సిగ్నల్ జంపింగ్ అనేది సాధారణమైపోయింది. నగరంలో వ్యాపార కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వాహనాలు రోడ్లపైనే బారులు తీరుతున్నాయి. నోపార్కింగ్ బోర్డులు ఉన్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇక నగరంలో హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వినియోగం అనేది కనీసం సగ శాతం మంది పాటించిన దాఖలాలు లేవు.
కొత్త చట్టంలో కఠిన నిబంధనలు
ప్రస్తుతం అమలులో ఉన్న మోటార్ వాహనాల చట్టంలో జరిమానాలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో వాహనచోదకులు నిబంధనలను అంతగా పట్టించుకోవడం లేదు. పోలీసులకు పట్టుబడితే చలానా డబ్బులు కట్టి వెళ్లిపోవచ్చు కదా! అన్న ధోరణిలో ఉన్నారు. ఇటువంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలు ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జరిమానాలు పెంచాలని సిఫార్సులు చేశాయి. ఈ క్రమంలో కొత్త రోడ్డు భద్రత రవాణా బిల్లుకు మోక్షం లభించింది. జరిమానాలు ఏకంగా ఐదింతలు, పదింతలు అయ్యేటట్టు ప్రతిపాదించారు.
రికార్డు స్థాయిలో ఆదాయం
నగరంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై 39 రకాలైన ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో జరిమానా విధిస్తున్నారు. 2005లో నగరంలో వాహనాలు రెండు లక్షలు కాగా.. 2016 జూలై నాటికి దాదాపు ఎనిమిది లక్షలకు చేరింది. ప్రతి ఏటా ట్రాఫిక్ పోలీసులు చలానాల రూపంలో జరిమానా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. గతేడాది దాదాపు రూ.15 కోట్లకు పైగా ఆదాయం చలానాల ద్వారా వచ్చింది. నగరంలో ఇళ్ల సంఖ్యకు మించి వాహనాలు ఉన్నాయని, 65 శాతం ఇళ్లలో రెండేసి వాహనాలు అంతకు మించి ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది.
కొత్త చట్టంతో ప్రమాదాలు తగ్గుముఖం
రహదారి భద్రత కొత్త చట్టంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. జరిమానాలు భారీగా ఉండడంతో వాహనదారుల్లో భయం పెరుగుతుంది. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తారు. చట్టంలో నిబంధనలు వ్యక్తిగత భద్రత, రక్షణ కోసమని వాహనచోదకులు భావించాలి. ప్రతి ఒక్కరూ ప్రమాదాల నివారణకు కషి చేయాలి. ప్రభుత్వం కొత్త చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేయడంతో కచ్చితంగా పాటిస్తాం.
– ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ
Advertisement