విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్.ఎఫ్.ఐ.) రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం నిర్వహించిన ధర్నాలో విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసివేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గురుకులాల ఏర్పాటు పేరుతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అసత్య ప్రచారం సాగిస్తున్నారని, హాస్టళ్ల విలీనం ద్వారా వేలాదిమంది విద్యార్థులకు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కడుపులు మాడ్చుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాలను రెట్టింపు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రావెల కిషోర్‌బాబు కలిసి విద్యార్థుల పొట్టలు కొడుతున్నారని మండిపడ్డారు.