జీవితంతో చెలగాటం | Ileana life | Sakshi
Sakshi News home page

జీవితంతో చెలగాటం

Published Thu, Dec 15 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

జీవితంతో చెలగాటం

జీవితంతో చెలగాటం

- కర్నూలు పెద్దాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
- లేనిరోగం అంటగట్టి.. ఆసుపత్రి నుంచి వెళ్లగొట్టి
–ప్రైవేటు ల్యాబుల్లో పరీక్ష చేయగా రోగం లేదని నిర్దారణ
–ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేసిన ప్రభుత్వ వైద్యుడు
   
వైద్యం కోసం ఓ నిరుపేద బాధితుడు కర్నూలు పెద్దాసుపత్రికి వస్తే లేని రోగం ఉందని  ఆపరేషన్‌ చేయలేమంటూ ఆసుపత్రి నుంచి వెళ్లగొట్టారు. వారు ఇచ్చిన డిశ్చార్జ్‌ కార్డు తీసుకుని ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా అక్కడ కూడా వెనక్కి పంపించారు. అనుమానం వచ్చి ఇతర ల్యాబ్‌ల్లో పరీక్ష చేయిస్తే ప్రమాదకరమైన ఆ వ్యాధి లేదని నిర్దారణ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడే ఇక్కడకు వచ్చి రోగికి ఆపరేషన్‌ చేశారు. లేని రోగం ఉందంటూ తమను తీవ్ర మానసిక, ఆర్థిక క్షోభకు గురిచేసిన వైద్యులకు బాధితుడి న్యాయవాధి ద్వారా నోటీసులు పంపించారు. 
- కర్నూలు(హాస్పిటల్‌)
 
గోనెగండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన జె.ఎల్లప్ప, ఆయన కుమారుడు బాబూరావు గత జులై నెల 8వ తేదీన ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో బాబురావు ఎడమ కాలు, ఎడమ కన్ను, చెంప భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకోగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పంపించారు. ప్లాస్టిక్‌ సర్జరీ వార్డులో చేరిన అతన్ని వైద్యులు పరిశీలించి ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగా సెంట్రల్‌ ల్యాబ్‌లో హెచ్‌ఐవీ, హెచ్‌బిసీ, హెచ్‌సీవీ పరీక్షలు చేయనందున ఆ కిట్లను తెప్పించి వార్డులోనే పరీక్షలు చేయించారు. అయితే ఈ పరీక్షల్లో బాబూరావుకు హెచ్‌సీవీ(హెపటైటిస్‌–సి) పాజిటీవ్‌గా తేలింది. దీంతో వైద్యులు అతనికి ప్రమాదకరమైన జబ్బు ఉందని,  కావున ఆపరేషన్‌ చేయలేమని అదే నెల 25న డిశ్చార్జ్‌ చేశారు. ఒకవైపు రక్తస్రావం అవుతుంటే వైద్యులు ఆపరేషన్‌ చేయకుండా వెనక్కి పంపించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్నేహితులు, బంధువులకు చెప్పి అప్పు చేసి అదే రోజు సాయంత్రం నగరంలోని బుధవారపేటలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి డిశ్చార్జ్‌ కార్డు చూసిన వైద్యులు హెచ్‌సీవీ రోగులకు తాము కూడా ఆపరేషన్‌ చేయలేమని వెనక్కి పంపించారు. అక్కడ నుంచి నగరంలోని నంద్యాల రోడ్డులోని మరో ప్రైవేటు ఆసుపత్రికి బాబూరావును తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సైతం వెనక్కి పంపించే ప్రయత్నం చేయడంతో తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డారు. తమకున్నది ఒక్కడే కుమారుడని, ఎలాగైనా రక్షించండని వేడుకున్నా కరుణించలేదు.
 
అనుమానం నిజమైంది:
బాబూరావుతో వచ్చిన ఓ యువకుడు కల్పించుకుని మరోసారి హెచ్‌సీవీ పరీక్షలు చేయిస్తామని, పాజిటీవ్‌ వస్తే చేయొద్దని చెప్పారు. దీంతో నగరంలోని నాలుగు ప్రైవేటు ల్యాబ్‌ల్లో బాబూరావుకు హెచ్‌సీవీ పరీక్ష చేయించారు. నాలుగు నివేదికల్లో నెగిటివ్‌ (జబ్బు లేదని) రిపోర్ట్‌ వచ్చింది. దీంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యుడే ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి బాబూరావుకు ప్లాస్టిక్‌ సర్జరీ విధానంలో ముఖానికి ఆపరేషన్‌ చేశారు. నాలుగురోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నందుకు బాబురావుకు రూ.1.30 లక్షలు ఖర్చు వచ్చింది. ఆ తర్వాత ప్రతిరోజూ ఆపరేషన్‌ చేసిన వైద్యుని వద్దకే రోజు విడిచి రోజు ఆల్వాల గ్రామం నుంచి రూ.2 వేలకు పైగా ఖర్చు పెట్టుకుని వచ్చి డ్రెస్సింగ్‌ చేయించుకున్నారు. ఇలా 10 సార్లు వచ్చిన వారికి రూ.30 వేలకు పైగా ఖర్చు అయ్యింది. మొత్తం రూ.2 లక్షలను ఆ కుటుంబం గ్రామంలోని బ్యాంకులు, తెలిసిన వారి వద్ద అప్పు చేసి కుమారున్ని బతికించుకునే ప్రయత్నం చేసింది. 
 
నష్టపరిహారం చెల్లించండి:
 ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన తప్పుడు పరీక్షతో తాము తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామని, వైద్యులను కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కనికరించలేదని బాబురావు తండ్రి ఎల్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడిన మానసిక క్షోభకు గాను రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాధి ద్వారా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామికి, ప్లాస్టిక్‌ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్‌ మంజులాబాయి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు  డాక్టర్‌ రమ్యదీప్తి, డాక్టర్‌ పీఎస్‌ రాజారవికుమార్‌కు రెండు రోజుల క్రితం నోటీసులు పంపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement