రక్తదానం..ప్రాణదానం | blood donation life donation | Sakshi
Sakshi News home page

రక్తదానం..ప్రాణదానం

Published Fri, Sep 30 2016 11:13 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

రక్తదానం..ప్రాణదానం - Sakshi

రక్తదానం..ప్రాణదానం

 
–ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదాతలే
–నేటి నుంచి జాతీయ స్వచ్ఛంద రక్తదాతల మాసోత్సవం
 
కర్నూలు(హాస్పిటల్‌): మనిషి జీవించాలంటే శరీరంలో రక్తసరఫరా ఎంతో ముఖ్యం. అది కూడా అందులో నిర్ణీత పరిమాణంలో ఏ మాత్రం తగ్గినా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రమాదాలు, ఆపరేషన్లు, ప్రసవాల సమయంలో రక్తం లభించక పోయిన ప్రాణాలూ ఉన్నాయి. అందుకే ఇటీవల కాలంలో రక్తదాతల సంఖ్య పెరిగింది. ఫేస్‌బుక్‌ అకౌంట్లు, వాట్సాప్‌గ్రూపులు, ఆన్‌లైన్‌ అకౌంట్లు, రక్తదాతల సంఘాలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే ఇప్పటికీ రక్తదానంపై చాలా మందికి అపోహలు ఉన్నాయి. సొంత కుటుంబసభ్యునికి సైతం రక్తం ఇచ్చేందుకు వెనుకాడే వారూ ఇప్పటికీ ఉన్నారు. అక్టోబర్‌ ఒకటి నుంచి 31వ తేదీ వరకు జాతీయ స్వచ్ఛంద రక్తదాతల మాసోత్సవాన్ని వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. 
ఎందుకు చేయాలంటే...!
ఒకరు చేసే రక్తదానంతో ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు.  మానవ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. దాన్ని ఉత్పత్తి చేయలేం.ఎక్కువ కాలం నిల్వ ఉంచలేము. నిల్వలను భర్తీ చేసేందుకు నిరంతర రక్తదానం అవసరం. రక్తదానం చేసేటప్పుడు రక్తశాతం, గ్రూపు తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఆరోగ్యంగా ఉండేవారు ఎవ్వరైనా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. ఒక్కసారి రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని శరీరం 24 నుంచి 48 గంటల్లోగా తిరిగి పునరుత్పత్తి చేసుకోగలుగుతుంది. 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉండి, 45 కిలోల బరువు ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేసేందుకు అర్హులు. వారి రక్తంలో హిమోగ్లోబిన్‌ 12.5 పైగా ఉండాలి. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రభుత్వ రక్తనిధితో పాటు నగరంలో రెడ్‌క్రాస్‌ రక్తనిధి, విశ్వభారతి రక్తనిధి, ఆర్‌ఆర్‌ హాస్పిటల్‌ రక్తనిధితో పాటు ఆదోని, నంద్యాలలో రక్తనిధులు ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా రక్తదానం చేయవచ్చు. ఒక యూనిట్‌ రక్తదానం చేసేందుకు 10 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. రక్తంలో 600లకు పైగా గ్రూపులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏ,బి,ఓ,ఏబీ, బాంబే పాజిటివ్, నెగిటివ్‌ గ్రూపులు. 
 
  శిబిరాలు పెంచాలి
జిల్లాలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాల శాతాన్ని పెంచాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి(ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసి) డాక్టర్‌ రూపశ్రీ చెప్పారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్‌)లో రక్తనిధుల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రై వేటు రక్తనిధుల కేంద్రాలు స్వచ్ఛంద రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని 30 శాతం ప్రభుత్వ రక్తనిధులకు విధిగా ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో రక్తనిధి లైసెన్స్‌ను రద్దు చేసేందుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అలీ హైదర్‌ , ప్రభుత్వ రక్తనిధి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేవతి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ కార్యాలయ సిబ్బంది దేవీశంకర్, నజీర్‌బాషా, వరప్రసాద్, రక్తనిధుల సిబ్బంది పద్మారెడ్డి, శ్రీధర్, అప్పలనాయుడు, గురుబ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. 
 
నేడు రక్తదాతలకు పురస్కారాలు
కర్నూలు(హాస్పిటల్‌): జాతీయ రక్తదాన దినోత్సవం రోజైన శనివారం రక్తదాతలకు పురస్కారాలు అందించనున్నట్లు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ జి. శ్రీనివాసులు చెప్పారు. శుక్రవారం రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో ఒక సంవత్సరంలో 12వేల మంది రక్తదానం చేశారన్నారు. రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయన్నారు. ప్రతి నెలా 100 మంది తలసీమియా వ్యాధి పిల్లలకు ఉచితంగా రక్తం ఇస్తున్నట్లు తెలిపారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement