ఎస్‌ఆర్‌కేఆర్‌లో ఈ–లెర్నింగ్ లైబ్రరీ ప్రారంభం
భీమవరం : ఇంజినీరింగ్ విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కంప్యూటర్ ల్యాబ్, ఫిజికల్ లైబ్రరరీ, ఈ–లñ ర్నింగ్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్టు భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు అన్నారు. కళాశాలలో రూ.14.5 లక్షల వ్యయంతో చేపట్టే ఏఐసీటీఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ ల్యాబ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో తమ కళాశాల సంయుక్త పరిశోధనలు చేయడం వల్ల విద్యార్థులు వాటిలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకే కాకుండా సమాజానికి ఉపయోగపడే వెట్ సెంటర్‌కు నీటి వనరులపై ప్రభుత్వాలకు, రైతులకు అవసరమైన సూచనలిస్తున్నట్టు ప్రసాదరాజు చెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారధి వర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ–లైబ్రరీలో అనేక వసతులు కల్పించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు చేతుల మీదుగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షుడు పి.కృష్ణంరాజు, డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ విజయనర్సింహరాజు, సాగి విఠల్ రంగరాజు, సాగి రామకృష్ణనిశాంత్ వర్మ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కెవిఎస్‌ఎన్‌రాజు పాల్గొన్నారు.