మధ్యాహ్న వంటలకు షెడ్ల నిర్మాణం
- తిప్పలు తప్పినట్టే..
- జిల్లా వ్యాప్తంగా 1,484 కిచెన్ షెడ్లు మంజూరు
- విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా షెడ్లు
- రూ.26.44 కోట్లు మంజూరు
- వంట కార్మికులకు సౌకర్యం
పాపన్నపేట:ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు తిప్పలు తప్పనున్నాయి. చెట్ల కింద వంటలు.. ఉడికీ ఉడకని అన్నం.. మరగని చారు వంటి ఇబ్బందులు ఇక ఉండబోవు. వంటలు చేయడానికి ప్రత్యేకంగా గదులు నిర్మించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో 1,484 పాఠశాలల్లో కిచెన్ షెడ్లు నిర్మించేందుకు రూ.26. 44 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో సుమారు 2,940 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో సగం పాఠశాలలకు కిచెన్‌షెడ్లు లేవు. దీంతో చాలా పాఠశాలల్లో ఆరుబయట, చెట్ల కింద, తరగతి గదుల్లో వంటలు చేస్తున్నారు. గాలి వాన సందర్భాల్లో, మండుటెండల్లో భోజన నిర్వాహకులు వంటలు చేస్తూ అవస్థలు పడుతున్నారు.
సరైన సౌకర్యాలు లేని కారణంగా వంటలు రుచికరంగా చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆరుబయట చేయడం వల్ల గాలికి అన్నం ఉడికేది కాదు. ఇలాంటి సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం కిచెన్ షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది.
నాలుగు రకాల కిచెన్ షెడ్లు...
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిచెన్‌షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇవి మొత్తం నాలుగు రకాలున్నాయి. 21 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లు 584 ఉండగా వాటికి ఒక్కోదానికి రూ.1.36 లక్షలు మంజూరయ్యాయి. 61 నుంచి 200 మంది విద్యార్థులున్న స్కూళ్లు 719 ఉండగా ఒక్కో దానికి రూ.1.86 లక్షలు, 201 నుంచి 500 మంది విద్యార్థులున్న స్కూళ్లు 156 ఉండగా ఒక్కో దానికి రూ.2.75 లక్షలు, 501 పైగా విద్యార్థులున్న స్కూళ్లు 25 ఉండగా ఒక్కో దానికి రూ.3.35 లక్షలు మంజూరయ్యాయి. మొత్తం 1,484 పట్టణ, గ్రామీణ పాఠశాలలకు కలిపి రూ.26.44 కోట్లు మంజూరు చేసింది.