రవాణాశాఖలో నగదు రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
♦ ఈ సేవ, ఆన్‌లైన్ కేంద్రాల్లో ఫీజుల చెల్లింపు
♦ త్వరలో అమల్లోకి రానున్న నూతన విధానం
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో నగదు రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి దాకా అన్ని రకాల రవాణా కార్యకలాపాలకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే ఫీజు తీసుకొని సర్వీసులు అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి చెప్పనున్నారు. ఇకపై పౌర సేవల కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని ఫీజులను ఈసేవ లేదా ఆన్‌లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. సేవల కోసం మాత్రమే ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. 15 రకాల పౌర సేవల కోసం గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానాన్ని ఇతర సేవలకు విస్తరించేందుకు అధికారు లు చర్యలు చేపట్టారు. మరో పది రోజుల్లో ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. దీంతో వినియోగదారు లు ఎలాంటి సేవలు పొందాలన్నా ఆన్‌లైన్‌లోనే సంప్రదించాలి. ప్రస్తుతం లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సులకు మాత్రమే ఈ సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించే పద్ధతి ఉంది. త్వరలో అన్ని సేవలకు ఇదే తరహాలో చెల్లించాలి.
50 రకాల సేవలకు వర్తింపు..
ఆర్టీఏ ఆన్‌లైన్ సేవలను 50 విభాగాలకు వర్తింపజేయనుంది. ఈ సర్వీసులపై త్వరలో బుక్‌లెట్‌ను రూపొందించి రవాణాశాఖ వెబ్‌సైట్ ద్వారా వాహన వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఏ రకమైన సర్వీసుకు ఎంత మొత్తం ఫీజు చెల్లించాలనేది బుక్‌లెట్‌లో ఉంటుంది. దళారులు, ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా నే రుగా ఆర్టీఏ సేవల ను పొందేందుకు ఇందులో అవకాశముంటుంది. డ్రైవింగ్ లెసైన్స్ రె న్యువల్, డూప్లికేట్ లెసైన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్, బ్యాడ్జ్, డ్రైవింగ్ లెసైన్స్‌లో చిరునామా మార్పు, డ్రైవింగ్ లెసైన్సు రద్దు, హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ (వాహనాలపై రుణ ఒప్పందం), హైర్ పర్చేజ్ టర్మినేషన్ (రుణం రద్దు), వాహన యాజమాన్య బదిలీ, డూప్లికేట్ ఆర్.సి, రెన్యువల్, చిరునామా మార్పు, ఆల్టరేషన్ ఆఫ్ వెహికల్ (అదనపు హంగులు), ఎన్‌ఓసీ జారీ (నిరభ్యంతర పత్రం), నిరభ్యంతర పత్రం రద్దు, త్రైమాసిక పన్ను చెల్లింపు, మోటారు వాహన చట్టం ఉల్లంఘనల కింద నమోదైన కేసుల్లో చెల్లించవలసిన జరిమానాలు వంటి వాటికి వినియోగదారులు ఈసేవ కేంద్రాలు, ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
‘ఎం-వాలెట్’కు అనూహ్య స్పందన
రవాణాశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన ‘ఆర్టీఏ ఎం-వాలెట్’కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఇప్పటి వ రకు 3 లక్షల మంది వినియోగదారులు ఈ యాప్ సేవలను వినియోగించుకున్నారు. ఈ యాప్ ద్వారా 4.25 లక్షల డ్రైవింగ్ లెసైన్సులు, ఆర్సీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌లోని డాక్యుమెంట్‌లను పోలీసులు పరిగణనలోకి తీసుకుంటున్న సంగతి కూ డా తెలిసిందే. కాగిత రహిత, నగదు రహిత సేవలను అందించేందుకు రవాణాశాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు.