పాత నోట్లు తీసుకుంటాం
పాత నోట్లు తీసుకుంటాం
Published Tue, Nov 22 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
తాడేపల్లిగూడెం :
ఏం కొనడానికి వెళ్లినా.. ’చిల్లర ఉందా’ 13 రోజులుగా జిల్లాలో ఏ దుకాణానికి వెళ్లినా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. తాడేపల్లిగూడెంలోని ఓ వ్యాపారి మాత్రం రండి బాబూ.. రండి. పాత నోట్లు ఎన్నయినా తీసుకురండి. మీకు నచ్చిన సరుకులు కొనుక్కెళ్లండని బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. పెద్దనోట్లు ఇచ్చాక అందుకు సరిపడే సరుకులను ఒకే రోజున కొనక్కర్లేదని.. నాలుగు రోజులపాటు వాటిని తీసుకోవచ్చంటూ సందడి చేస్తున్నాడు. రైల్వే స్టేషన్ రోడ్డులో కల్యాణి కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తున్న కుమార్ అనే వ్యాపారి ఓ బోర్డు పెట్టిమరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. రూ.500, రూ.1000 రూపాయలకు సరిపడా డ్రింక్స్, పాలు, పెరుగు, బిస్కెట్లు, రీచార్జ్ కూపన్లు, రిఫండ్ ఆయిల్, పామాయిల్, బియ్యం (25 కిలోల బస్తా) తీసుకెళ్లాలంటూ బోర్డు పెట్టాడు. పాత నోట్లను మీరేం చేస్తారని అడిగితే ’బ్యాంకులో ఖాతాలో వేసుకుంటాం.ఽ బ్యాంక్ ఖాతాలో సొమ్ము రూ.2.50 లక్షలు దాటితే ఏమవుతుంది. మహాఅయితే నోటీసు ఇస్తారు. పోనీ.. అరెస్ట్ చేస్తారా. చేసుకోమనండి. నేనేమీ తప్పు చేయడం లేదు. నోట్ల రద్దుతో కష్టాల్లో ఉన్న వినియోగదారులకు సేవ చేస్తున్నా. ప్రధాని మోదీయే కాదు. నేను, నా భార్య కల్యాణి ఇలా సేవ చేస్తున్నాం’ అని సగర్వంగా చెబుతున్నాడు. భలే ఆఫర్ కదూ. ఇంకెందుకు ఆలస్యం మీ వద్ద పాతనోట్లు ఇంకా ఉంటే.. చలో తాడేపల్లిగూడెం.
Advertisement
Advertisement