బాటిల్ పగిలితే పండగే..
• డ్యామేజ్ పేరిట ఐఎంఎల్ డిపోలో దోపిడీ
• పగిలేది తక్కువ....చూపించేది ఎక్కువ
• వైరా మద్యం డిపోలో సిబ్బంది చేతివాటం
వైరా:
మద్యం డిపోలో ఐఎంఎల్(ఇండియన్ మేడ్ లిక్కర్) సిబ్బంది బహిరంగంగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైరా ఐఎంఎల్ డిపోలో తక్కువ డ్యామేజ్‌ను ఎక్కువగా చూపి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వైరా డిపో నుంచి జిల్లా వ్యాప్తంగా బార్లు, వైన్స్‌కు మద్యం సరఫరా చేస్తుంటారు. వివిధ మద్యం కంపెనీల సరఫరాదారుల ద్వారా వచ్చిన మద్యాన్ని డిపోల్లో నిల్వ ఉంచుతారు. మద్యం సరఫరాకు సంబంధించిన లోడింగ్, అన్‌లోడింగ్ సమయంలో కొంత మేర డ్యామేజ్ కావడం సహజం. పగిలిన బాటిళ్లను డ్యామేజ్‌ను లాస్ కింద చూపించడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు డ్యామేజ్‌ను ఎక్కువగా చూపుతున్నారు. ఈ తతంగం చాలాకాలం నుంచి జరుగుతోంది.
ఒకటికి....రెండు లెక్క...
డిపోలో ఒక బాటిల్ పగిలితే రెండు లెక్క రాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మామూలుగా ఐదు బాక్సుల(కాటన్లు) లిక్కర్, బీర్ డ్యామేజ్ అయితే 10 బాక్సులు డ్యామేజ్ అయినట్లు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పగిలిన సీసాల పేరు చెప్పి మిగుల్చుకున్న మద్యం బాటిళ్లను తమకు తెలిసిన వారు నిర్వహించే బార్‌లు, వైన్స్ షాపులకు సరాసరి ధరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్యామేజ్ అయిన సరుకుకు అధికారికంగా ఎలాంటి బిల్లులూ ఉండకపోవడం వీరి తెరచాటు వ్యవహారానికి దోహదపడుతోంది. డిపోలో ధర కన్నా తక్కువకు కొందరు డిపో సిబ్బంది సరుకు బయటకిస్తుండటంతో వైన్స్ యజమానులు వాటిపై మక్కువ చూపుతున్నారని వినికిడి. ఈ విధంగా వచ్చిన రోజువారీ ఆదాయం తిలాపాపం తలా పిడికెడు అన్నచందంగా పంపిణీ జరుగుతుంది.
ప్రతిరోజూ రూ.వేలల్లో ఆదాయం
ఐఎంఎల్ డిపోలకు రోజు వారీగా పదుల సంఖ్యలో లారీలు మద్యాన్ని తీసుకొస్తుంటాయి. ఇక్కడి నుంచి తిరిగి రెండు జిల్లాల్లోని వైన్స్‌లు, బార్ షాపులకు అదేస్థాయిలో వెళ్తుంటాయి. ఒక్కో లారీలో తక్కువలో తక్కువ రెండు మూడు బాక్సులైనా పగిలినట్లుగా ఇక్కడి సిబ్బంది చూపుతున్నట్లు సమాచారం. రవాణా సమయంలో డ్యామేజ్ అయితే సదరు కంపెనీ వారే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. రోజుకు డిపోలో పది నుంచి పదిహేను బాక్సులనైనా డ్యామేజ్ కింద చూపుతారని తెలుస్తోంది. ఓ కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిళ్ల మద్యం ఒక్కో బాక్సు ధర వైన్స్ షాపులో పెరిగిన ధరల ప్రకారం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్యలో ఉంటుంది. ఒక రోజు ఈ కంపెనీకి చెందిన కనీసం ఐదు బాక్సులు డ్యామేజ్ చూపితే ఒక్కో బాక్సుకు రూ.2 వేల చొప్పున ఐదు బాక్సులకు సుమారుగా రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది.
ఇక్కడి విధులకు పోటీ ఎక్కువ
వైరాలోని ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఇష్టపడతారు. ఇక్కడ పనిచేస్తే వేతనంతో పాటు చేతి నిండా ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్సైజ్ వారు ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు పోటీ పడతారని సమాచారం. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పి మరీ పోస్టింగ్‌లు వేయించుకుంటారు. ఇక్కడ పని చేస్తున్న కొద్ది మంది అధికారులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వారికి బదిలీలు కూడా లేవు. అంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.