ఏటూరునాగారం అడవుల్లో 50 వేల చెట్లు కుప్పకూలడానికి కారణాలివే
అటవీశాఖ వర్క్‌షాప్‌లో శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయం
సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్‌ఏఆర్‌ఎల్), ఎ¯న్‌జీఆర్‌ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్‌ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక..
పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్‌షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment