ఇన్‌పుట్‌ సబ్సిడీ ఔట్‌! | input subsidy funds maybe returns to govt | Sakshi
Sakshi News home page

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఔట్‌!

Published Sat, Aug 13 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

ఎండిపోయిన వేరుశనగ

ఎండిపోయిన వేరుశనగ

– మదనపల్లె డివిజన్‌లో 10వేల మంది రైతులకు మొండిచేయి
– ఆన్‌లైన్‌లో వివరాలు అంగీకరించకపోవడమే అసలు కారణం
– రైతుల కొంపముంచిన సాంకేతిక సమస్యలు
– మూడుతరాలకు ముందు చనిపోయినవారి పేర్లతో జాబితా
– డెత్‌ కేసులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రాదన్న అధికారులు
– నిత్యం బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ రైతులు
పలమనేరు:
మదనపల్లె డివిజన్‌లో గత ఏడాది వేరుశనగ సాగుచేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ. 10కోట్లకు పైగా వెనక్కిపోనుంది. పదివేల మంది రైతులకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేసేందుకు వీలుకాకపోవడమే ఇందుకు కారణం. గతంలో మతిచెందినవారి పేరిటే చాలావరకు పాసుపుస్తకాలున్నాయి. రెవెన్యూశాఖ పంట సాగుదారుకు బదులు 1బి ఆధారంగా జాబితాను తయారుచేయడంతో ప్రస్తుతం రైతులకు పంట నష్టపరిహారం అందని పరిస్థితి తలెత్తింది. డెత్‌ కేసులకు సంబంధించి పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వివిధ సాంకేతిక కారణాలతో  ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొట్టింది. జిల్లాలో గతేడాది వేరుశనగను పండించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హెక్టారుకు రూ.10వేలు న ష్టపరిహారంగా ఇచ్చేందుకు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రూ. 90 కోట్లకు పైగా ఇందుకు మంజూరు చేశామని తెలిపింది. సంబందిత రెవెన్యూ గ్రామాల వీఆర్వోల నుంచి వ్యవసాయశాఖ వివరాలను సేకరించింది. ఇందులోని రైతులను సంబంధిత బ్యాంకులో వ్యక్తిగతఖాతాలను తెరవాలని సూచించారు. దీంతోపాటు రైతుల ఆధార్‌కార్డులను బ్యాంకు ఖాతా, భూమి టైటిల్‌దారు, అనుభవదారు వివరాలు మ్యాచయితే నేరుగాఖాతాలోకే పరిహారం అందుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు పలు కారణాలను సాకుచూపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ కాలేదని రైతులకు పరిహారం చెల్లించడం లేదు.
 
 ఇదిగో సాక్ష్యం....
పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబందించి 29,287 మంది రైతులు,14,916 హెక్టార్లలో వేరుశనగ పండించి నష్టపోయారు. వీరికి రూ.11.89 కోట్లను మంజూరు చేసింది. సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్‌లో నమోదుకాని రైతులు దాదాపు రెండువేల మంది ఉన్నారు. వీరికి అందాల్సిన రూ.2 కోట్లు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు విడుదలకాలేదు.
 
మదన పల్లె డివిజన్‌లో రూ.10 కోట్లు వెనక్కే....
డివిజన్‌ పరిధిలోని పలమనేరు,కుప్పం,పుంగనూరు, మదనపల్లె, తంబ్ళపల్లె నియోజకవర్గాల్లో దాదాపు పదివేల మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో రూ.10 కోట్లు వెనక్కిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గడువు మించింది కాబట్టి ఈ నిధులను ప్రభుత్వానికి జమ చేయనున్నట్టు వ్యవసాయశాఖ చెబుతోంది.
 
  ఆన్‌లైన్‌లో తలెత్తిన  ఇబ్బందులు ఇవి....
–చనిపోయిన వారిపేరిట పాసుపుస్తకాలుండటం
–టైటిల్, ఎంజాయ్‌మెంటు ఒక్కటిగా లేనివారు
–ఆధార్, బ్యాంకు ఖాతా సరిపోక ..
–రెవెన్యూ వెబ్‌లో ఎంట్రీకపోవడం..
– మీసేవ అడంగుల్‌ సైట్‌లో అధికారుల తప్పిదాలు
–ఇక్కడ భూములున్న కర్ణాటక సరిహద్దు రైతులు
–సాగుచేసి మైగ్రేషనయిన రైతులు వివరాలు లేక
– కౌలు రైతుగా ఎంట్రీలు లేనివారు
– అర్హతలున్నప్పటికీ వీర్వోలు జాబితాలో పేరులేనివారు
ఇలా రకరకాల కారణాలతో ఆన్‌లైన్‌లో వివరాలు అంగీకరించలేదు. దీంతో సంబందిత రైతులకు పరిహారం అందకుండా పోయింది.
 
ఆన్‌లైన్‌లో ఎంట్రీకాకపోతే ఏమీ చేయలేం.....
 
 సాంకేతిక పరమైన కారణాలతో పరిహారం రానిమాట నిజమే.  క్షేత్ర స్థాయిలోవారు పంటను సాగుచేసినా రకరకాల కారణాలతో కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ కావడం లేదు. ముఖ్యంగా డెత్‌ కేసుల్లో పరిహారం రానట్టే. ఇక్కడ జరుగుతున్న సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలిపాం.
విశ్వనాథ రెడ్డి, సహాయసంచాలకులు, పలమనేరు డివిజన్‌
 
 
రైతులతో చెలగాటమాడుతోంది...
 
అర్హులైన ప్రతి రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజస్తామన్న సర్కారు ఇప్పుడు టెక్నికల్‌ సమస్యల పేరిట రైతులను నట్టేనముంచేసింది. రెవిన్యూశాఖ చేసిన తప్పిదాలకు రైతులను బాధ్యులను చేయడం సమంజమా.. దీనిపై పోరాటానికి దిగుతాం.
ఉమాపతి, ఏపీ రైతుసంఘ నాయకులు, పలమనేరు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement