
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కోదండరాం
- సమరశీలత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి..
- యువతకు ఉపాధి కల్పిస్తేనే అభివృద్ధి
- చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ సభలో ప్రొఫెసర్ కోదండరాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘తెలంగాణ పోరాట పటిమకు గుర్తు.. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం వీరోచితంగా పోరాడి.. జైలుకెళ్లడం.. దొరల గూండాలను ఎదిరించి.. తన భూమిని కాపాడుకున్న ధీరవనిత చాకలి ఐలమ్మ’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కీర్తించారు. ఖమ్మంలోని ధర్నాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయనతోపాటు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ సోమవారం ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐలమ్మ విగ్రహావిష్కరణ, వర్థంతి సభకు తెలంగాణ బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి అధ్యక్షత వహించగా.. కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజా సామాజిక ఉద్యమాలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం.. చాకలి ఐలమ్మ సమరశీలత్వాన్ని ఆదర్శంగా తీసుకుని కొనసాగిందన్నారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందినప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్లని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు చేయూతనివ్వాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమాజం అభివృద్ధి దిశలో నడుస్తుందని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం కష్టమైన పనికాదని, ప్రణాళికతో ముందుకెళితే ఇది సాధ్యమేనన్నారు. ప్రజలకు అండగా.. జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో జిల్లా జేఏసీ నాయకులు విస్తృతంగా పోరాటం చేసి.. ఉద్యమ జెండాను రెపరెపలాడించారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు 12 శాతం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. దళితులకు రాజ్యాధికారం దక్కితేనే స్వాతంత్య్ర ఫలాలు దక్కుతాయని అంబేడ్కర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో దళితులకు 25 శాతం ఉచిత విద్యను అందించాలని చెప్పిన ప్రభుత్వ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఇచ్చిన జీఓలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఎందుకు అడ్డొస్తాయని ప్రశ్నించారు. ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఎన్నో అవాంతరాలు కల్పించారని, అయినా వీటిని ఎదుర్కొని విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ.. వారి కోసం అమలు చేయాల్సిన పథకాలను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో ప్రొఫెసర్లు ఐ.తిరుమలి, కనకాచారి, బీవీ.రాఘవులు, సామాజిక వేత్త ఉ.సాంబశివరావు, చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచందర్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు, బీసీ ఫ్రంట్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కేవీ.కృష్ణారావు, డాక్టర్ ఎస్.పాపారావు, రచయిత జ్వలిత, పలు సంఘాల నేతలు చిలకల వెంకటనర్సయ్య, లింగాల రవికుమార్, జె.విశ్వ, సుంకర శ్రీనివాస్, భద్రునాయక్, వినయ్‌కుమార్, లాల్‌జాన్‌పాషా, వరలక్ష్మి, దుంపటి నగేష్, వెంపటి నాగేశ్వరరావు నాయుడు, కె.నర్సయ్య, షేక్ షకీనా, తిప్పట్ల నర్సింహారావు, పొదిల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.