– అటవీ శాఖ ఆరు డివిజన్లలోనూ ఇదే పరిస్థితి
– రెండేళ్లుగా పోస్టుల భర్తీ ఊసెత్తని సర్కారు
– యథేచ్చగా సాగుతున్న ఎర్రదొంగల రాకపోకలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
ఎర్రచందనం చెట్లు ఎక్కువగా విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో బీట్ ఆఫీసర్ల కొరత పెరిగింది. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలోని ఆరు ప్రధాన డివిజన్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కొరత నెలకొంది. కేటాయించిన పోస్టుల్లో కేవలం సగం మంది కూడా విధుల్లో కనిపించడం లేదు. వీరితో పాటు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు,సెక్షన్ ఆఫీసర్లు, రేంజి ఆఫీసర్ల కొరత డివిజనల్ స్థాయి అటవీ అధికారులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు ఏ అవసరమొచ్చినా హుటాహుటిన వెళ్లేందుకు సరిపడ బీట్ ఆఫీసర్లు లేక రెండేళ్లుగా ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. అటవీ రేంజిల్లో బీట్ ఆఫీసర్ల కొరతను ముందుగానే పసిగట్టిన స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిపోయారు. దీంతో ఆఫీసర్లు లేని రేంజిలను ఎంపిక చేసుకుని ఎర్రదుంగల తరలింపునకు యత్నిస్తున్నారు.
చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ, నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడే ఎర్రచందనం చెట్లు పెరిగాయి. వీటి కోసం నిత్యం వందలాది మంది ఎర్ర కూలీలు ఏదో ఒక మార్గంలో అడవుల్లోకి చొరబడుతూనే ఉన్నారు. అయితే కీలకమైన అటవీ డివిజన్లలో సంపద పరిరక్షణ బాధ్యతల్లో ఉండే బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల కొరత ఎక్కువగా ఉంది. ఏడు వేల హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతానికో బీట్ ఆఫీసర్ ఉండాల్సి ఉంది. అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తూ సంపదను పరిరక్షించేది వీరే. ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, నంద్యాల డివిజన్లలో వీరు మొత్తం 200 మందికి పైగా ఉండాలి. అయితే ఉన్నది మాత్రం కేవలం 74 మందే. కేటాయించిన పోస్టుల్లో సగం మంది కూడా లేరు. ఏబీవో, ఎఫ్‌బీవో, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజి ఆఫీసర్, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, డీఎఫ్‌వో, కన్సర్వేటర్, చీఫ్ కన్సర్వేటర్ పోస్టుల్లో కేవలం సగం మంది మాత్రమే విధుల్లో ఉంటున్నారు. ఉదాహరణకు తిరుపతి అటవీ డివిజన్‌లో 104 మంది ఉద్యోగులకు గాను ఉన్నది మాత్రం 67 మందే. మిగతా 37 పోస్టులూ ఖాళీనే. అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 29 మందికి గాను 12 మందే ఉన్నారు. 17 పోస్టులు రెండేళ్లుగా భర్తీ కాలేదు.
32 మంది ఎఫ్‌బీవోలకు గాను 22 మందే ఉన్నారు. పది పోస్టులు ఖాళీ. ఈ విధంగా అన్ని డివిజన్లలోనూ కేటగిరీల వారీగా కేటాయించిన పోస్టుల్లో సగం మంది ఉద్యోగులే ఉన్నారు. తిరుపతి డివిజన్‌లోని బాలపల్లి అటవీ రేంజిలో ఎర్రచందనం ఎక్కువ. ఇక్కడ రేంజి ఆఫీస్ భవనం కూడా లేదు. సిబ్బంది కూడా 50 శాతం లేరు. స్మగ్లర్లను అరెస్టు చేయడం, వారిని కోర్టులకు హాజరు పర్చడం వంటి డ్యూటీలు కూడా అటవీ సిబ్బందే చూడాల్సి ఉంది. రేంజి ఆఫీసర్లకు సమావేశాలు జరిగే సమయంలో స్మగ్లర్లు రెచ్చిపోతే పట్టుకోవడానికి సరిపడ సిబ్బంది లేక ఉద్యోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. వీరు మాత్రమే కాకుండా డివిజన్లలో అన్ని స్థాయిల్లోని పోస్టులూ రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సెక్షన్ ఆఫీసర్ల కేడర్ వరకూ ఉన్న పోస్టులను డీఎఫ్‌వో స్థాయి అధికారులే భర్తీ చేస్తుంటారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇవ్వనందున ఇవి కూడా భర్తీ కాలేదు. అటవీ శాఖను ఆదాయ వనరుగానే పరిగణిస్తోన్న ప్రభుత్వం ఆ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల కేటాయింపు, ఆయుధాల సరఫరాలో మాత్రం నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది.