
అరగంట నిద్ర లేకుంటే అసహనమే: కడియం
ఎంజీఎం (వరంగల్): డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రిగా క్షణం తీరిక లేకుండా పనిచేసే కడియం శ్రీహరి.. అప్పుడప్పుడూ తనను అసహనం ఆవహిస్తుందని చెప్పారు. ఆదివారం వరంగల్ లోని ఓ హోటల్ లో స్లీప్ అప్ డేట్స్ (స్లీప్ సెన్సెన్)పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
'మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అర్ధగంట సేపు నిద్రపోకపోతే తీవ్ర అసహనానికి గురవుతా. చక్కగా ఓ అర్ధగంట నిద్రపోతే, రిఫ్రెష్ అయి, మళ్లీ రాత్రి వరకు చురుకుగా పనిచేయగలుగుతా' అని చెప్పుకొచ్చారు. వర్తమాన జీవన విధానం ఎంతటి గందరగోళంగా ఉందో తనదైన శైలిలో వివరిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఏది ఏమైనా రాత్రి 10.30 దాటుతుందంటే కంటి మీద కునుకు ఆగదని, పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోతానని, ఉదయం 7 గంటలకుగానీ మెలకువ రాదని వివరించారు కడియం.