రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద కంపెనీలు ఆసక్తి చూపడంలేదు. రెండేళ్లు దాటినా టాప్ 500 కంపెనీల్లో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకురావడం లేదని ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) పేర్కొంది.
లోటు బడ్జెట్ ఉండడం, కనీస మౌలిక వసతులు లేకపోవడంతో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం విఫలమవుతోందని ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ ముత్తవరపు మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఏపీ చాంబర్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.
సబ్సిడీలు, రాయితీలు లేనిదే కొత్త రాష్ట్రంలో కంపెనీలు స్థాపించడానికి ఎవ్వరూ ఆసక్తి చూపించరన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అనుకున్న వేగంగా జరగడం లేదని, కనుచూపు మేరలో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కనపడటం లేదన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రం వెనుకబడుతుందని, అందుకే కేంద్రం తక్షణం ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.