వంటనూనె ప్యాకెట్లో మాంస వ్యర్థాలు!
వంటనూనె ప్యాకెట్లో మాంస వ్యర్థాలు!
Published Fri, Aug 5 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
గాదేపూడి (గుడ్లవల్లేరు) :
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే జంతువులు, పక్షుల కళేబరాల వ్యర్థాలతో తయారు చేస్తున్న నకిలీ వంటనూనె, నెయ్యి ముఠాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ పేరిట మార్కెట్‌లోకి విడుదలైన పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్‌లో పేగులు, కొవ్వు వ్యర్థాలు వచ్చిన సంఘటన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన అప్పినీడి భాస్కరరావు చెబుతున్న మేరకు ఆయన కొనుగోలు చేసిన కిలో వంట నూనె ప్యాకెట్‌లో ఈ వ్యర్థాలు వచ్చాయి. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. వడ్లమన్నాడులో ఓ దుకాణంలో కొని తెచ్చానన్నారు. ఇంటికొచ్చి కత్తిరించగా ఆయిల్ బాగా దుర్వాసన వచ్చిందని, దానిలో నుంచి పేగులు, కొవ్వు ముక్కలు పడ్డాయని తెలిపారు. నూనె రక్తం రంగులో ఎర్రగా ఉందన్నారు. ఆ వంటనూనెను వాడలేక పక్కన పెట్టేశామన్నారు. ఒక ప్రముఖ కంపెనీ పేరిట ముద్రించిన ఆయిల్ కవర్లను కల్తీ ముఠాలు ఉపయోగించుకున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రముఖ కంపెనీ అయితే వినియోగదారులకు అనుమానం లేకుండా నమ్మకంతో కొనుగోలు చేస్తారని ఇలా అక్రమార్కులు తెగబడ్డారని చెబుతున్నారు. ఇంకా ఎన్ని బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ సంస్థలు ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసే కల్తీరాయుళ్ల గుట్టు బయటపడుతుందని కోరుతున్నారు.
Advertisement
Advertisement