ఈసారైనా తేలేనా..?
-
సీసీఐ అక్రమాలపై ఏడాదిన్నరగా కొనసాగుతున్న సీబీఐ విచారణ
-
తాజాగా మళ్లీ జమ్మికుంటలో సీబీఐ అధికారుల విచారణ షురూ..
-
ఇప్పటికే మూడుసార్లు తనిఖీలు నిర్వహించిన అధికారులు
-
జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో సీబీఐ అధికారుల తనిఖీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జమ్మికుంట : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై గత రెండేళ్లుగా సెంట్రల్ బ్యూరో ఇఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు కొనసాగిస్తున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. సీబీఐ డీఎస్పీ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో అధికారులు గత రెండ్రోజులుగా జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మార్కెట్ కార్యాలయంలో రికార్డులున్న బీరువాను సీజ్ చేశారు. 2004–2015 మధ్య కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేసి రిటైర్డ్ అయిన అధికారులను పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. పత్తి కొనుగోళ్లు, రికార్డులకు సంబంధించి మార్కెట్ కార్యాలయ అధికారులను పలు ప్రశ్నలు వేసి ఆరా తీశారు. హైకోర్టు ఆదేశాలతో 2015 ఫిబ్రవరిలో ప్రారంభమైన సీబీఐ విచారణ దఫదఫాలుగా కొనసాగుతుండటంతో ఇప్పట్లో కొలిక్కి వచ్చేనా? అక్రమాలు వెలుగు చూసేనా? దోషులెవరనేది ఇప్పట్లో తేలేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ మొదలైంది ఇలా....
సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జమ్మికుంటకు చెందిన రాజేశ్వర్‌రావు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన హైకోర్టు సీసీఐ పత్తి కొనుగోళ్లపై విచారణ జరపాలని 2015 ఫిబ్రవరిలో సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సీసీఐ లావాదేవిలపై సీబీఐ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఫిబ్రవరి 13న జమ్మికుంటలో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 12 సీబీఐ బృందాలు సీసీఐ కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ సెంటర్ ఇన్‌చార్జీల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. జమ్మికుంట సెంటర్‌లో పనిచేసిన సీసీఐ అధికారి ఇంటిపై వరంగల్‌లో సీబీఐ అధికారులు తనిఖీలు చేయగా భారీగా ఆస్తులు, బంగారు అభరణాలు, లక్షల్లో నగదు లభ్యమయ్యాయి. జమ్మికుంటలో సైతం ఆడ్తిదారులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారుల ఇళ్లపై డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. పాత వ్యవసాయ మార్కెట్లో సీసీఐకి సంబంధించిన రైతుల తక్‌పట్టీలు, పట్టదారు పాసుపుస్తకాలు, రికార్డులను అప్పట్లో సీజ్ చేశారు.
మళ్లీ అక్టోబర్‌లో తనిఖీలు
2015 ఫిబ్రవరిలో సీసీఐ పత్తి కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేసిన అధికారులు మళ్లీ అదే ఏడాది అక్టోబర్‌లో జమ్మికుంటలో విచారణ చేపట్టారు. 2004 నుంచి 2015 వరకు మార్కెట్లో సీసీఐకి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి అమ్మిన రైతుల వివరాలను గ్రామాల్లోకి వెళ్లి వివరాలు సేకరించారు. పట్టణంలోని పలు బ్యాంకుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులను పరిశీలించారు. తక్‌పట్టీల వారీగా రైతుల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించారు. సీసీఐ కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నవంబర్‌లో సైతం సీబీఐ అధికారులు సీసీఐ కొనుగోళ్లపై అనేక కోణాల్లో విచారణ జరిపి నివేదిక తయారు చేశారు. చార్జీషీట్ దాఖాలు చేస్తున్నారనే ప్రచారం నాడే జరిగింది. అప్పటినుంచి మౌనంగా ఉన్న సీబీఐ అధికారులు తాజాగా మళ్లీ జమ్మికుంటలో విచారణ చేపట్టడం చర్చనీయాంశమైంది. నాడు విచారణ చేపట్టిన సీబీఐ అధికారుల్లో పలువురు బదిలీ అయినట్లు తెలుస్తోంది.
సీబీఐ విచారణలో చిట్టా ఇదే...
సీబీఐ విచారణలో అనేక అక్రమాలు వెలుగుచూసినట్లు తెలిసింది. సీసీఐ ఎంత మంది వద్ద పత్తి కొనుగోళ్లు చేసింది? అందులో బినామీ రైతులెందురున్నారు? రెతుల పేరుతో సీసీఐకి పత్తిని విక్రయించిన దళారులు ఎవరు? మొత్తం ఎన్నికోట్ల అక్రమ దందా సాగింది? అక్రమాలకు సూత్రధారులెరు? ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యముంది? అనే అంశాలపై సీబీఐ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. వరంగల్‌లో నివాసముంటూ జమ్మికుంటలో దందా కొనసాగిస్తున్న పలువురు వ్యాపారులను, ఆడ్తిదారులను సీబీఐ అధికారులు రహస్యంగా విచారించారు. పలువురు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. అప్పట్లో విచారణ పూర్తయిందని భావించిన రైతులు.. తాజాగా మళ్లీ సీబీఐ విచారణ చేపట్టడంతో ఇప్పట్లో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశాల్లేవనే భావనకు వచ్చారు.