‘హక్కు పత్రాలుండి.. పోడు చేసుకుంటున్న గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు.
♦ అతిగా వ్యవహరిస్తున్న ‘అటవీ’ అధికారులు
♦ ఆస్పత్రుల్లో అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు
♦ వాడివేడిగా ఐటీడీఏ పాలక మండలి సమావేశం
♦ హాజరైన మంత్రులు చందూలాల్, డాక్టర్ లక్ష్మారెడ్డి, తుమ్మల
ఐటీడీఏ పాలకమండలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల, చిత్రంలో మంత్రులు చందూలాల్, లక్ష్మారెడ్డి, ఎంపీ పొంగులేటి, కలెక్టర్ లోకేష్ కుమార్, ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు, గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్ లక్ష్మణ్, జెడ్పీచైర్‌పర్సన్ కవిత
సాక్షిప్రతినిధి, ఖమ్మం/అశ్వారావుపేట : ‘హక్కు పత్రాలుండి.. పోడు చేసుకుంటున్న గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకున్న గిరిపుత్రులు కుటుంబాలను పోషించుకుంటున్నారు. అవి మా భూములంటూ అటవీ శాఖాధికారులు ఇప్పుడు అడ్డు తగులుతున్నారు. హక్కు పత్రాలున్నా.. అడుగుపెట్టనివ్వరా? ఇదెక్కడి న్యాయం? సీఎం కేసీఆర్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పినా.. అటవీ శాఖ అధికారులు పట్టించుకోరా? పీహెచ్‌సీలు శిథిలావస్థకు చేరాయి. మందు బిళ్లలు సకాలంలో అందడం లేదు. ఆస్పత్రుల్లో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చేసింది. ఇంకెప్పుడు చికిత్సలు మొదలుపెడతారు’.. అంటూ ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు సమస్యపై ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు.
దాదాపు ఐదు నెలల తర్వాత అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఐటీడీఏ పాలక మండలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ అధ్యక్షత వహించగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు అటవీ భూములు, పోడు సమస్య, వైద్యం తదితర అంశాలపై వాడివేడిగా చర్చ కొనసాగింది. పోడు భూముల సమస్యపైనే ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో గిరిజనుల సమస్యలను లేవనెత్తి.. అటవీ అధికారుల తీరును నిరసిస్తూ.. వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రులకు విన్నవించారు.
తొలుత వైద్యంపై చర్చించారు. ఆ తర్వాత పోడు భూములు, విద్య, సంక్షేమం, ట్రైకార్ రుణాలపై చర్చించారు. ఆశ్రమ పాఠశాలలకు ప్రహరీలు, అంతర్గత రహదారులు లేవని సభ్యులు చెప్పగా.. జిల్లాలో రూ.8.21కోట్ల ప్రతిపాదనలు పంపామని, అంతర్గత రహదారులకు రూ.5.74కోట్లతో ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే దశలవారీగా పనులు చేపడతామని పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు చెప్పారు. ఐటీడీఏ, ఆశ్రమ పాఠశాలల్లో ఫలితాలు నానాటికీ తగ్గుతున్నాయని.. అధికారులు పరిశీలించాలని కోరగా.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని పీఓ అన్నారు. దుమ్ముగూడెం తహసీల్దార్ ఆదివాసీల పట్ల చులకనగా ప్రవర్తిస్తున్నారని.. అసలు పనిచేయని తహసీల్దార్‌పై చర్య తీసుకునే వారే లేరని సమావేశంలో లేవనెత్తారు.
అతడిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హెచ్చరించామని.. మార్పు రాకుంటే చర్య తీసుకుంటామని కలెక్టర్ లోకేష్‌కుమార్ చెప్పారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. అనుమతి లేకుండా పాఠశాలలు నడుపుతున్నారని, ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు చెల్లించలేక గిరిజనులు అప్పుల పాలవుతున్నారని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములు, వైద్యంపై చర్చించిన అంశాల వరకే మంత్రులు సమావేశంలో ఉన్నారు. తర్వాత మిగిలిన రెండు అంశాలపై కలెక్టర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చర్చించారు.
విషజ్వరాలను నివారించాలి..
సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విష జ్వరాలను ఏజెన్సీలో పూర్తిస్థాయిలో నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే మందులు, కిట్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గతంలో అవగాహన లేకపోవడంతో విషజ్వరాలతో చాలా మంది గిరిజనులు చనిపోయారన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్కడక్కడ పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మరమ్మతులు ఉన్నాయో? వాటిని రెండు, మూడు నెలల్లో బాగు చేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో తొలుత జిల్లాలోని ఏజెన్సీలోనే పర్యటించినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫీల్డ్‌కు వెళ్లరు.. ఏం జరుగుతుందో తెలియదు..
అటవీ శాఖ అధికారులు ఫీల్డ్‌కు వెళ్లరని, అక్కడ ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీ శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో వందెకరాల్లో వ్యవసాయం చేస్తున్న వారిని అటవీ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. కొద్ది మొత్తంలో పోడు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. 2005 తర్వాత ఆక్రమించిన భూములపై అటవీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అటవీ హక్కుల చట్టంలో గిరిజనులకు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసుకోవద్దనే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అని ఆయన అటవీ అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో జేసీ దివ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ కన్జర్వేటర్ నర్సయ్య, జెడ్పీ సీఈఓ నగేష్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఈఓ రాజేష్, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.