
సమావేశంలో మాట్లాడుతున్న వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు
సుల్తాన్ బజార్: తెలంగాణలో గో రక్షకులపై పోలీసులు అమానుష దాడులకు పాల్పడుతున్నారని వీహెచ్‌పీ నేతలు ఆరోపించారు. ఆదివారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్ధాయి ప్రచార విభాగం సమావేశం నిర్వహించారు. వీహెచ్‌పీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆకారపు కేశవరాజు, రాష్ట్ర సహ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రావినూతల శశిధర్, సత్యనారాయణలు హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతంలో 1948 కంటే ముందు కొనసాగిన హిందూ వ్యతిరేక పాలన నేడు మళ్లీ 2014 నుంచి కొనసాగుతుందని వారు ఆరోపించారు.
ఖాశీం రజ్వీ ఏ విధంగానైతే హిందువులపై బరితెగించి దాడి చేశాడో, అదేరీతిలో ఇప్పటి పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న ఎంఐఎం నేతలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి సూచనల మేరకే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. దీనిపై డీజీపీ స్పందించాలని వారు కోరారు. లేనిపక్షంలో డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.
చిన్న చిన్న జంతువులను హింసిస్తే, అప్పటికప్పుడు వాలిపోయే జంతు ప్రేమికులు గోహత్యలు జరుగుతుంటే ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రచార ప్రముఖ్‌లు హాజరయ్యారు. అంతకుముందు భారతమాత విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ప్రచార విభాగం నాయకులు రాంబాబు, అనిల్‌యాదవ్, రాధాకష్ణ,రాజేందర్, కృష్ణ, ధీరజ్, కైలాష్ తదితరులు పాల్గొన్నారు.