హిట్లర్ పాలనను తలపిస్తోంది
హిట్లర్ పాలనను తలపిస్తోంది
Published Sat, Jul 29 2017 11:06 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
టీడీపీ ప్రభుత్వంపై జక్కంపూడి ఆగ్రహం
ధవళేశ్వరంలో 23 మంది కాపు నాయకుల అరెస్టు
ధవళేశ్వరం : రాష్ట్రంలో హిట్లర్ పాలన తలపించే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనను సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. శనివారం ఆమె ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కాపు సంఘ నాయకులను కలిసి సంఘీభావం తెలిపారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలు దేరిన కాపు సంఘ నాయకులను పోలీసులు స్టేషన్ సెంటర్‌లో అడ్డుకున్నారు. అక్కడే నిరసనకు దిగిన కాపు సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. విషయం తెలసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ చేరుకొని దక్షిణ మండల డీఎస్పీ నారాయణరావుతో చర్చించారు. అనంతరం అరెస్ట్ అయిన కాపు నాయకులను విడుదలచేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కాపులపై వివిధ సెక‌్షన్లు ప్రయోగిస్తూ చంద్రబాబు వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కాపు ప్రజాప్రతిని«ధులు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ భూములను గంటా శ్రీనివాసరావుకు, అంగన్‌వాడీ కేంద్రాలను మంత్రి నారాయణకు నజరానాగా ఇవ్వడం వల్లనే వారు విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ధవళేశ్వరం బస్టాండ్‌సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. కాపు సంఘ నాయకులు పెన్నాడ జయప్రసాద్, మెండా సత్తులు, గరగ శ్రీనివాసరావు, బండారు బంపి, దొండపాటి శ్రీనివాస్, సాధనాల చంద్రశేఖర్ (శివ), ఏజీఆర్ నాయుడు, ముత్యాల పోసికుమార్, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, యడ్ల వెంకటేష్, అల్లంపల్లి ముత్యాలు, పందిళ్ల భానుప్రసాద్, దూది సాయి, నూకరాజు, గపూర్, గాలి ప్రసన్నకుమార్, దళిత సంఘ నాయకులు రేగుళ్ల రఘు, మిరప రమేష్, రాజేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement