శరత్ బాబు, చంద్రబోస్‌లకు జాలాది పురస్కారాలు
Published Sat, Aug 6 2016 5:09 PM | Last Updated on Thu, May 24 2018 1:33 PM
విశాఖ :సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ జాలాది పేరిట జాలాది చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నంలో నెలకొల్పిన జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 9 సాయంత్రం ఇక్కడి కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు ఆంధ్ర విశ్వకళా పరిషత్ రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వర రావు వెల్లడించారు.
శనివారం ఆయన స్థానిక హోటల్‌లో విలేకర్లతో మాట్లాడారు. జాలాది 85వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి కొత్తగా జాతీయ స్థాయి ప్రతిభకు కొలమానంగా ఏర్పాటు చేసిన ‘జాలాది జీవన సాఫల్య పురస్కారం–2016’కు విలక్షణ నటుడు శరత్ బాబును తమ నిపుణుల కమిటీ ఎంపిక చేసిందన్నారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను జాలాది ఆత్మీయ పురస్కారానికి ఎంపిక చేశామని చెప్పారు. ఆ రోజు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథ రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తి తదితరులు అతిథులుగా హాజరై పురస్కార ప్రదానం చేయనున్నట్టు రిజిస్ట్రార్ వివరించారు.
జాలాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ కవి జాలాది వంశాంకురాలైన తామ తోబుట్టువుంతా కలసి ఏర్పాటు చేసుకున్న ఈ ట్రస్ట్ ద్వారా 2012 నుంచి తెలుగు రాష్ట్రాల పరిధిలో పురస్కార ప్రదానోత్సవాలతోపాటు, విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి జాతీయ పురస్కారం కింద రూ. 50వేల నగదు, సన్మానం ఉంటుందని వివరించారు.
లోగడ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలందుకున్నవారిలో దర్శకులు పీసీ రెడ్డి, కళ్లు రఘు, స్టార్ మేకర్ లంక సత్యానంద్, గేయ రచయితలు భువనచంద్ర, రసరాజు, అదష్ట దీపక్, గురు చరణ్, సంభాషణ రచయితలు ఎంవీఎస్ హరనాథ రావు, కాశీ విశ్వనాథ్. నిరాత పోకూరి బాబూరావు, నటి అర్చన వంటి ప్రముఖులున్నారని వివరించారు. తమ తండ్రి ఆశయ సిద్ధి కోసం కంకణబద్ధులమై జాలాది ట్రస్ట్ ద్వారా బహుముఖ సేవలందించడంతోపాటు జాలాది విరచిత గీతాలతో సినీ సంగీత విభావరి నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. తాము ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కళాప్రియులంతా ఉచితంగా ఆస్వాదింవచ్చని ఆమె సూచించారు.
Advertisement