జలారాధన హిందూ సంప్రదాయం
-
వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్
-
‘కృష్ణా పుష్కర ప్రాశస్త్యం’ పుస్తకం ఆవిష్కరణ
వెదురుపాక (రాయవరం) :
సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారమైన జలాన్ని దేవత రూపంలో ఆరాధించడం హిందూ సంప్రదాయంలో భాగమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) అన్నారు. మురమళ్లకు చెందిన బాణాల దుర్గాప్రసాద్ సిద్ధాంతి రచించిన ‘సార్థ త్రికోటి తీర్థరాజ సహిత కృష్ణా పుష్కరాలు’ పుస్తకాన్ని మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శుక్రవారం గాడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ నది, కోనేరు, సముద్ర, మాఘ, మంగళ స్నానాలు అనే సంప్రదాయాలన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయన్నారు. నదీ స్నానాలన్నింటిలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పేర్కొన్నారు. తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధాలు, ఔషధాల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయన్నారు. జీవరాశులకు ప్రధానమైన జలస్నాన ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలన్నారు. కృష్ణా పుష్కరాల ప్రాశస్తా్యన్ని వివరిస్తూ పుస్తకం రాసిన దుర్గాప్రసాద్ సిద్ధాంతిని అభినందించారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల విశిష్టతను, ఏ నక్షత్రం వారు ఎక్కడ పుష్కర స్నానమాచరించాలి, పుష్కరాల 12 రోజుల్లో చేయాల్సిన దానధర్మాలు, దర్శించాల్సిన క్షేత్రాలు, పిండ ప్రదానం, పుష్కర స్నాన నియమాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి), కమిటీ సభ్యులు భాస్కర నారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.