vedurupaka
-
నేటి నుంచి విజయదుర్గాపీఠం వార్షికోత్సవాలు
వెదురుపాక (రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠం 44వ వార్షికోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ) సోమవారం తెలిపారు. 1972 ఆగస్టు 18వ తేదీన పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీతీర్థ స్వామి శ్రీ విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. అమ్మవారికి పీఠంలో నిరంతరాయంగా పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాలు సర్వతో భద్రతా మండప ఆవాహనతో మంగళవారం ఉదయం 8.05 గంటలకు పూజలు ప్రారంభమవుతాయని బాబీ చెప్పారు. అనంతరం తమిళనాడు తిరుత్తణిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆస్థాన పండితులచేత కాలసర్ప, కుజగ్రహ దోష నివారణార్థం శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం నిర్వహించనున్నట్లు వివరించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతికల్యాణం జరుగుతుందన్నారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీరామచంద్రమూర్తికి సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ పండితులచేత దివ్య కల్యాణం జరుగుతుందని చెప్పారు. 18వ తేదీ ఉదయం 9.16 గంటలకు శ్రీ విజయదుర్గా అమ్మవారి నవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు తిరుమల శ్రీ వైఖానస ఆగమ పండితులచే శ్రీ భూ సహిత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు బాబీ తెలిపారు. -
జలారాధన హిందూ సంప్రదాయం
వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ‘కృష్ణా పుష్కర ప్రాశస్త్యం’ పుస్తకం ఆవిష్కరణ వెదురుపాక (రాయవరం) : సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారమైన జలాన్ని దేవత రూపంలో ఆరాధించడం హిందూ సంప్రదాయంలో భాగమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) అన్నారు. మురమళ్లకు చెందిన బాణాల దుర్గాప్రసాద్ సిద్ధాంతి రచించిన ‘సార్థ త్రికోటి తీర్థరాజ సహిత కృష్ణా పుష్కరాలు’ పుస్తకాన్ని మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శుక్రవారం గాడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ నది, కోనేరు, సముద్ర, మాఘ, మంగళ స్నానాలు అనే సంప్రదాయాలన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయన్నారు. నదీ స్నానాలన్నింటిలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పేర్కొన్నారు. తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధాలు, ఔషధాల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయన్నారు. జీవరాశులకు ప్రధానమైన జలస్నాన ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలన్నారు. కృష్ణా పుష్కరాల ప్రాశస్తా్యన్ని వివరిస్తూ పుస్తకం రాసిన దుర్గాప్రసాద్ సిద్ధాంతిని అభినందించారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల విశిష్టతను, ఏ నక్షత్రం వారు ఎక్కడ పుష్కర స్నానమాచరించాలి, పుష్కరాల 12 రోజుల్లో చేయాల్సిన దానధర్మాలు, దర్శించాల్సిన క్షేత్రాలు, పిండ ప్రదానం, పుష్కర స్నాన నియమాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి), కమిటీ సభ్యులు భాస్కర నారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు ప్రేమతో ఎంతో చేయాలని ఉంది..
త్వరలో హీరోగా తెరంగేట్రం చేస్తా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ వెదురుపాక(రాయవరం) : నాన్న లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఏ పనిచేసినా ఆయనే గుర్తుకు వస్తున్నారు. కుగ్రామంలో జన్మించి సినీ ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని లి ఖించుకోవడమే కాదు.. మాకూ కొన్ని పేజీలు మిగిల్చి వెళ్లారు. నాన్నకు ప్రేమ తో.. గ్రామానికి ఎంతో చేయాలని ఉంది.. ఆలోచనలకు త్వరలోనే కార్యరూపం తీసుకువస్తానంటున్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. శనివారం రాయవరం మండలం వెదురుపాకలోని స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన తన భావాలను ఇలా వివరించారు. ‘సూర్యోదయం’ వేదికైంది.. నాన్న తన తల్లిదండ్రులు సూర్యనారాయణ, ఉదయభాస్కరం పేరిట వెదురుపాకలో ‘సూర్యోదయం’ నిర్మించారు. కుటుంబాల కలయికకు ఇది వేదికగా నిలుస్తోంది. అందుకే చెల్లెలు పద్మిని ప్రియదర్శిని సీమంతం వేడుకను ఇక్కడ చేస్తున్నాం. నాన్నకు ప్రేమతో.. నాన్న సత్యమూర్తిపై ఉన్న ప్రేమతో గ్రామానికి ఏదైనా చేయాలని ఉంది. నాన్నకు చదువంటే ఎంతో ఇష్టం..గ్రామాన్ని విద్యాపరంగా చైతన్యం చేయాలని ఉంది. నాన్న పేరిట గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఉంది. ఆయన తొలి వర్ధంతి రోజును గ్రామంలో వేడుకగా చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. కొరటాల శివ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్‌తో నిర్మిస్తున్న ‘జనతా గ్యారేజ్’, క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, చిరంజీవి 150వ సిని మాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. 16 ఏళ్ల సినీ సంగీత ప్రస్థానంలో 70 సినిమాలకు సంగీతం అందించాను. ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాను. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని కోరారు. త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నా. నా తొలి ప్రాధాన్యం సంగీతానికి ఇవ్వడం వల్లనే నటనపై ఆసక్తి చూపలేదు. టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు.. నా సినీ సంగీత ప్రయాణంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా. టాలెంటర్సతో ప్రోగ్రామ్స్ చేసి యూట్యూబ్‌లో పెట్టాలనే ప్రాజెక్టుకు కార్యరూపం తీసుకు వస్తాను. ఏ పనైనా ఇష్టంతో కష్టపడి చేస్తే పేరు దానంతట అదే వస్తుంది. వెదురుపాకలో సోదరి సీమంతం వేడుక వెదురుపాక (రాయవరం) : ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ శనివారం మండలంలోని వె దురుపాకలో హల్చల్ చేశారు. దేవిశ్రీప్రసాద్ తండ్రి ప్రముఖ సినీ కథా రచయిత సత్యమూర్తి మరణానంతరం తొలిసారిగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహానికి వచ్చారు. సత్యమూర్తి తల్లితండ్రుల పేరుతో నిర్మించిన స్వగృహం ‘సూర్యోదయం’లో దేవిశ్రీ ప్రసాద్ సోదరి పద్మిని ప్రియదర్శినికి సీమంతాన్ని నిర్వహించారు. పద్మిని ప్రియదర్శినిని వేదమంత్రాల నడుమ దేవిశ్రీప్రసాద్ తల్లి శిరోమణి, సోదరులు దేవిశ్రీప్రసాద్, సాగర్, ఆమె భర్త వివేక్‌లు ఆశీర్వచనాలు అందజేశారు. ముత్తైవులు అంతా కలిసి సీమంతం పాటలు పాడుతూ ప్రియదర్శినికి పండంటి బిడ్డ జన్మించాలంటూ దీవెనలు అందజేశారు. ముందుగా సత్యమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు ఆచంట రాంబాబు, తులసి, కొమ్ముల బ్రహ్మానందం, సీతామహాలక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు భాషల్లో ‘రెడ్ అలర్ట్’
వెదురుపాక (రాయవరం) :‘ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో రూపొందించిన సినిమా త్వరలో వెండితెర పైకి రాబోతోంది. ఆయా నటులతో కలసి ఒకేసారి సినిమాకు దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. ఆ రికార్డు నా సొంతం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు చంద్రమహేశ్. ‘ప్రేయసి రావే’ సినిమాకు దర్శకత్వం వహించి తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు అందుకున్న ఆయన గురువారం విజయదుర్గా పీఠానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దర్శకుడిగా ఎదిగిన తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రెడ్ అలర్ట్’ ఒక రికార్డు.. నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి సినిమా నిర్మించడం ఒక రికార్డు. తెలుగు, కన్నడలో ‘రెడ్ అలర్ట్’గా, తమిళంలో ‘చెన్నై నగరం’, మలయాళంలో ‘హై అలర్ట్’ పేరుతో త్వరలోనే ఈ సినిమా విడుదల చేయనున్నాం. హీరోగా మహదేవను పరిచయం చేస్తున్నాం. హీరోయిన్గా అంజనీ మీనన్, ప్రధాన పాత్రల్లో సుమన్, పోసాని కృష్ణమురళి, అలీ, కౌశ, కాశీ విశ్వనాథ తదితరులు నటిస్తున్నారు. సంగీతం రవివర్మ. నిర్మాత పీవీ శ్రీరామరెడ్డి. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ నెల 13 నుంచి 20 వరకూ జరుగుతుంది. జనవరిలో సినిమా విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే నటుడు, దర్శకుడు భాగ్యరాజా కుమారుడు శాంతన్ భాగ్యరాజా హీరోగా ‘లవ్ ఇన్ హైదరాబాద్’ సినిమాకు దర్శకత్వం వహించాను. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం. భార్య ప్రోత్సాహంతోనే.. మాది జిల్లాలోని శంఖవరం గ్రామం. నాకు చిన్ననాటి నుంచీ సినిమాలపై ఎంతో ఆసక్తి. ఇంట్లో అందరూ ఉద్యోగస్థులు కావడంతో సినిమా పరిశ్రమ వైపు వెళ్లేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. వివాహమైన తర్వాత భార్య రాజశ్రీ ప్రోత్సహించింది. భార్యా పిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాను. మూడు నెలలు రామానాయుడు స్టూడియోకు కాళ్లరిగేలా తిరగ్గా.. నా పట్టుదల చూసి చివరకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా సూపర్ పోలీస్ సినిమాకు అవకాశం ఇచ్చారు. వృత్తిపట్ల అంకితభావం చూసి నా రెండో సినిమా ధర్మచక్రంకు అసోసియేట్ డెరైక్టర్‌గా చేశారు. తర్వాత నాయుడిగారి కుటుంబం, శివయ్య, ప్రేమించుకుందాం..రా, పెద్ద మనుషులు సినిమాలకు అసోసియేట్ డెరైక్టర్‌గా పని చేశాను. రామానాయుడి ఆశీస్సులతోనే.. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు ఆశీస్సులతోనే దర్శకుడిగా మారాను. పోసాని కృష్ణమురళి అందించిన కథతో ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా మారి నంది అవార్డు అందుకున్నాను. అనంతరం అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా.. హుషారుగా, హనుమంతు, ఆలస్యం.. అమృతం సినిమాలు చేశాను. హనుమంతు సినిమాకు రెండోసారి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాను. సినీ పరిశ్రమ స్లంప్‌లో ఉంది ఇటీవల సినీ పరిశ్రమ స్లంప్‌లో ఉంది. ఏ సినిమా అయినా హిట్ అవాలంటే కథ బాగుండాలి. అందుకే సినిమాకు కథే హీరో. దశాబ్దకాలంగా హిట్ శాతం పడిపోయింది. దర్శకుడికి 24 ఫ్రేమ్‌లపై అవగాహన, పట్టు ఉండాలి. నూతన దర్శకుల్లో అవగాహన లోపం ఉంది. మంచి పాయింట్ తీసుకున్నా టేకింగ్‌లో న్యాయం చేయలేకపోతున్నారు. -
కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను..
లెక్కించలేనన్ని వన్నెలను ప్రకృతిలో పొదిగిన విధి అతడికి ఒక్కగానొక్క వన్నె కూడా తెలియకుండా చేసింది. అయితేనేం.. ‘నీ జీవితాన్ని ఏడువన్నెల ఇంద్రధనువుగా మార్చడానికి నేనున్నాను. నీకు తెలియని రంగుల్ని నా స్పర్శగా, ప్రేమగా అనువదించి అందిస్తా’నంది ఓ యువతి. ‘చూపు లేని నీ బతుకునావకు చుక్కానిని అవుతాను’ అన్న ఆ యువతి వేలికి ఉంగరం తొడిగే వేళ అతడు.. ఇన్నాళ్లూ తనను చిన్నచూపు చూసిన విధినే చిన్నబుచ్చినంత పరమానందభరితుడయ్యాడు. పుట్టంధుడైన వేల్పూరి రవిబాబు, స్వరూపరాణిల కులాంతర వివాహం శనివారం తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో జరిగింది. వెదురుపాకకు చెందిన వీరబాబు పుట్టుకతోనే అంధుడు. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తల్లి మంగ, తండ్రి వెంకన్న అనారోగ్యంతో మృతిచెందారు. కంటిచూపు లేదని, కన్నవారు లేరని అతడు కుంగిపోలేదు. మండపేటలోని ప్రత్యేక అంధుల పాఠశాలలో చేరాడు. మొక్కవోని సంకల్పంతో డిగ్రీ, డీఈడీ చదివిన వీరబాబు 2012 డిసెంబర్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ప్రస్తుతం కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి ఎంపీయూపీ పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా సమిశ్రగూడెంకు చెందిన స్వరూపరాణి డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి ఆశ వర్కర్ కాగా తండ్రి చిరుద్యోగి. కులాలు వేరైనా వీరబాబు, స్వరూపరాణిల వివాహం చేయడానికి పెద్దలు ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన స్వరూపరాణి ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవయ్యా...అందుకే నా కన్నులతో లోకం చూడయ్యా’ అంటూ వీరబాబు జీవితంలో ప్రవేశించింది. అంధుల పాఠశాలలో వీరబాబు సహాధ్యాయులు, అతడి గురువులు వివాహానికి హాజరయ్యారు. వీరబాబు సహాధ్యాయులు తమకు కళ్లులేక పోయినా.. ఆనందకాంతులు నిండిన ముఖాలతో నవదంపతులను ఆశీర్వదిస్తుంటే చూసేవారి కళ్లు భావోద్వేగంతో చెమ్మగిల్లాయి. ఎంతోమంది స్నేహహస్తం అందించారు.. నేను చదువుకునే సమయంలో మండపేట ప్రత్యేక అంధుల పాఠశాల యాజమాన్యంతో పాటు స్నేహితులు సహకరించారు. నేను చదవడానికి ఆర్థికంగా స్నేహితులు చేసిన సహాయం, అందించిన ప్రోత్సాహం మరువలేనిది. - వేల్పూరి వీరబాబు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను.. మనిషికి దేవుడిచ్చిన వరం ఈ ప్రకృతి. దానిని చూడలేని వీరబాబుకు నా కళ్లతో ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. అతడిని నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను. - స్వరూపరాణి -
రెక్కల కష్టం బుగ్గిపాలు
వెదురుపాక(రాయవరం), న్యూస్‌లైన్ : వారివి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. కాయకష్టం చేసుకునే వారి కష్టార్జితం అగ్నిప్రమాదంలో బుగ్గిపాలయింది. సోమవారం అర్ధరాత్రి ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు పోర్షన్ల పెంకుటిల్లు దగ్ధం కాగా, మంగళవారం ఉదయం ఓ తాటాకిల్లు కాలిబూడిదైంది. మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఆయా ప్రమాదాల్లో సుమారు రూ.ఆరులక్షల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెదురుపాకలో అన్నదమ్ములైన సత్తి గోపాలరెడ్డి, సత్తి సత్తిరెడ్డి స్థానిక రెడ్ల రామాలయం వీధిలో ఉన్న పెంకుటింట్లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో పెంకులు పగులుతున్న శబ్ధాలు రావడంతో ఎలుకలు తిరుగుతున్నాయని భావించామని గోపాలరెడ్డి, సత్తిరెడ్డి చెప్పారు. వేడిగా తగలడంతో బయటకు వచ్చి చూసేసరికి నడికొప్పు మంటల్లో చిక్కుకుందన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదన్నారు. పెట్టుబడి కోసం గోపాలరెడ్డి తెచ్చిన రూ.30 వేల నగదు, బ్యాంకులో కట్టాల్సిన డ్వాక్రా సొమ్ము రూ.18 వేలు, సత్తిరెడ్డి ఇంట్లో చేను పెట్టుబడి కోసం ఉంచిన రూ.50 వేలు, రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిదిన్నర కాసుల బంగారు పుస్తెల తాళ్లు కాలిపోయాయి. ఫర్నిచర్, దుస్తులు, నిత్యావసరాలు బూడిదవ్వడంతో వారు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో రూ. 4.5 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. అనపర్తికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ్జకూలీకి వెళ్లినప్పుడు.. ఇదే గ్రామంలోని శెట్టిబలిజ రామాలయం సమీపంలో ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో వాసంశెట్టి చిన్నకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. చిన్న, అతడి భార్య లక్ష్మి కలిసి చేలో కూలీ పనికి వెళ్లిన సమయంలో ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు వాటిని అదుపుచేసేందుకు విఫలయత్నం చేశారు. ఆహారం కోసం దాచుకున్న ఆరు బస్తాల ధాన్యం, కౌలుకు చేస్తున్న చేలో వేసేందుకు తెచ్చిన 12 వేల విలువైన యూరియా, డీఏపీ ఎరువు, అరకాసు బంగారం, రబీ పెట్టుబడి కోసం అప్పుగా తెచ్చి.. ఇంట్లో ఉంచిన రూ.20 వేల నగదు బూడిదయ్యాయి. ప్రమాదంలో రూ.1.5 లక్షలు నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎగసిపడుతున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసేందుకు లైన్మెన్లు అందుబాటులో లేరని గ్రామస్తులు ఆరోపించారు. సంఘటనస్థలాన్ని తహశీల్దార్ ఎం.రవిబాబు, సర్పంచ్ కొండేపూడి సత్యప్రభ, సొసైటీ అధ్యక్షుడు సత్తి వీర్రాఘవరెడ్డి తదితరులు పరిశీలించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా పది కిలోల వంతున బియ్యాన్ని అందజేశారు.