నాలుగు భాషల్లో ‘రెడ్ అలర్ట్’
వెదురుపాక (రాయవరం) :‘ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో రూపొందించిన సినిమా త్వరలో వెండితెర పైకి రాబోతోంది. ఆయా నటులతో కలసి ఒకేసారి సినిమాకు దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. ఆ రికార్డు నా సొంతం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు చంద్రమహేశ్. ‘ప్రేయసి రావే’ సినిమాకు దర్శకత్వం వహించి తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు అందుకున్న ఆయన గురువారం విజయదుర్గా పీఠానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దర్శకుడిగా ఎదిగిన తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘రెడ్ అలర్ట్’ ఒక రికార్డు..
నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి సినిమా నిర్మించడం ఒక రికార్డు. తెలుగు, కన్నడలో ‘రెడ్ అలర్ట్’గా, తమిళంలో ‘చెన్నై నగరం’, మలయాళంలో ‘హై అలర్ట్’ పేరుతో త్వరలోనే ఈ సినిమా విడుదల చేయనున్నాం. హీరోగా మహదేవను పరిచయం చేస్తున్నాం. హీరోయిన్‌గా అంజనీ మీనన్, ప్రధాన పాత్రల్లో సుమన్, పోసాని కృష్ణమురళి, అలీ, కౌశ, కాశీ విశ్వనాథ తదితరులు నటిస్తున్నారు. సంగీతం రవివర్మ. నిర్మాత పీవీ శ్రీరామరెడ్డి. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ నెల 13 నుంచి 20 వరకూ జరుగుతుంది. జనవరిలో సినిమా విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే నటుడు, దర్శకుడు భాగ్యరాజా కుమారుడు శాంతన్ భాగ్యరాజా హీరోగా ‘లవ్ ఇన్ హైదరాబాద్’ సినిమాకు దర్శకత్వం వహించాను. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం.
భార్య ప్రోత్సాహంతోనే..
మాది జిల్లాలోని శంఖవరం గ్రామం. నాకు చిన్ననాటి నుంచీ సినిమాలపై ఎంతో ఆసక్తి. ఇంట్లో అందరూ ఉద్యోగస్థులు కావడంతో సినిమా పరిశ్రమ వైపు వెళ్లేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. వివాహమైన తర్వాత భార్య రాజశ్రీ ప్రోత్సహించింది. భార్యా పిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాను. మూడు నెలలు రామానాయుడు స్టూడియోకు కాళ్లరిగేలా తిరగ్గా.. నా పట్టుదల చూసి చివరకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా సూపర్ పోలీస్ సినిమాకు అవకాశం ఇచ్చారు. వృత్తిపట్ల అంకితభావం చూసి నా రెండో సినిమా ధర్మచక్రంకు అసోసియేట్ డెరైక్టర్‌గా చేశారు. తర్వాత నాయుడిగారి కుటుంబం, శివయ్య, ప్రేమించుకుందాం..రా, పెద్ద మనుషులు సినిమాలకు అసోసియేట్ డెరైక్టర్‌గా పని చేశాను.
రామానాయుడి ఆశీస్సులతోనే..
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు ఆశీస్సులతోనే దర్శకుడిగా మారాను. పోసాని కృష్ణమురళి అందించిన కథతో ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా మారి నంది అవార్డు అందుకున్నాను. అనంతరం అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా.. హుషారుగా, హనుమంతు, ఆలస్యం.. అమృతం సినిమాలు చేశాను. హనుమంతు సినిమాకు రెండోసారి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాను.
సినీ పరిశ్రమ స్లంప్‌లో ఉంది
ఇటీవల సినీ పరిశ్రమ స్లంప్‌లో ఉంది. ఏ సినిమా అయినా హిట్ అవాలంటే కథ బాగుండాలి. అందుకే సినిమాకు కథే హీరో. దశాబ్దకాలంగా హిట్ శాతం పడిపోయింది. దర్శకుడికి 24 ఫ్రేమ్‌లపై అవగాహన, పట్టు ఉండాలి. నూతన దర్శకుల్లో అవగాహన లోపం ఉంది. మంచి పాయింట్ తీసుకున్నా టేకింగ్‌లో న్యాయం చేయలేకపోతున్నారు.