నాగ్ అశ్విన్‌ది నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు
డైరెక్టర్‌గా ఎవడే సుబ్రమణ్యంతో టాలీవుడ్‌కు పరిచయం
మహానటి చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు
ప్రస్తుతం కల్కి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రెబల్‌స్టార్ ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్‌స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్‌గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది.
సాక్షి, నాగర్‌కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్‌పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్‌లో యూరాలజిస్ట్‌గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్‌కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు.
⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్‌కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌కు ఎంపికైంది.
అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్‌తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్‌గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్‌లో ‘ఎక్స్‌లైఫ్’ సిగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది.
స్వగ్రామంలో హర్షాతిరేకాలు
దర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం.
ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు..
మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్‌లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లి
ఇంకా గొప్ప విజయాలు సాధించాలి..
ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్‌లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం.
– హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment