ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.
అయితే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. కల్కి మేకర్స్ మహాభారతాన్ని వక్రీకరించారని అన్నారు. కొన్ని సన్నివేశాల్లో పురాణ ఇతిహాసాన్ని మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాజాగా కల్కి మూవీ వీక్షించిన ముకేశ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివ్యూను వెల్లడించారు. కల్కి చిత్రంలోని విజువల్స్, నటనను ప్రశంసించినప్పటికీ మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.
ముఖేశ్ మాట్లాడుతూ.. "నన్ను బాధిస్తున్న ఒక విషయం ఏమిటంటే.. కల్కి మేకర్స్ ఈ చిత్రంలో మహాభారతాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అశ్వథామను వేడుకున్నట్లు చూపించారు. అశ్వథామ మణిని శ్రీకృష్ణుడు తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నా రక్షకుడివని అతన్ని శ్రీకృష్ణుడు వేడుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ విషయంపై నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా. మీకు వ్యాసముని కంటే ఎక్కువ తెలుసునని ఎలా ఊహించుకున్నారు. నేను నా చిన్నప్పటినుంచి మహభారతం చదువుతున్నా. అశ్వత్థామ 'మణి'ని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదు. ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి' అని అన్నారు.
అనంతరం ముకేశ్ మాట్లాడుతూ..'నేను ఈ కథను ఇంత వివరంగా చెప్పడానికి కారణం. కృష్ణుడు భవిష్యత్తులో తనను రక్షించమని కల్కిలో అశ్వత్థామను ఎలా ఆజ్ఞాపించాడో నాకు అర్థం కాలేదు? అంత శక్తిమంతుడైన శ్రీకృష్ణుడు.. తనను రక్షించమని అశ్వత్థామను ఎలా అడగుతాడు? ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి. దక్షిణాది ఫిల్మ్ మేకర్స్‌కి మన సంప్రదాయాలపై ఎక్కువ గౌరవం ఉందని అనుకుంటున్నాం? కానీ రామాయణం, గీత, ఇతర పౌరాణిక అంశాలతో రూపొందిస్తున్న చిత్రాలను పరిశీలించాలి. అవసరమైతే సినిమా స్క్రిప్ట్ పరిశీలనకు కమిటీని వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా.. మహాభారత్ సీరియల్‌లో భీష్ముని పాత్రలో ముకేశ్ ఖన్నా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment