వెదురుపాక(రాయవరం), న్యూస్‌లైన్ : వారివి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. కాయకష్టం చేసుకునే వారి కష్టార్జితం అగ్నిప్రమాదంలో బుగ్గిపాలయింది. సోమవారం అర్ధరాత్రి ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు పోర్షన్ల పెంకుటిల్లు దగ్ధం కాగా, మంగళవారం ఉదయం ఓ తాటాకిల్లు కాలిబూడిదైంది. మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఆయా ప్రమాదాల్లో సుమారు రూ.ఆరులక్షల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని వెదురుపాకలో అన్నదమ్ములైన సత్తి గోపాలరెడ్డి, సత్తి సత్తిరెడ్డి స్థానిక రెడ్ల రామాలయం వీధిలో ఉన్న పెంకుటింట్లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో పెంకులు పగులుతున్న శబ్ధాలు రావడంతో ఎలుకలు తిరుగుతున్నాయని భావించామని గోపాలరెడ్డి, సత్తిరెడ్డి చెప్పారు. వేడిగా తగలడంతో బయటకు వచ్చి చూసేసరికి నడికొప్పు మంటల్లో చిక్కుకుందన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదన్నారు.
పెట్టుబడి కోసం గోపాలరెడ్డి తెచ్చిన రూ.30 వేల నగదు, బ్యాంకులో కట్టాల్సిన డ్వాక్రా సొమ్ము రూ.18 వేలు, సత్తిరెడ్డి ఇంట్లో చేను పెట్టుబడి కోసం ఉంచిన రూ.50 వేలు, రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిదిన్నర కాసుల బంగారు పుస్తెల తాళ్లు కాలిపోయాయి. ఫర్నిచర్, దుస్తులు, నిత్యావసరాలు బూడిదవ్వడంతో వారు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో రూ. 4.5 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. అనపర్తికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
్జకూలీకి వెళ్లినప్పుడు..
ఇదే గ్రామంలోని శెట్టిబలిజ రామాలయం సమీపంలో ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో వాసంశెట్టి చిన్నకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. చిన్న, అతడి భార్య లక్ష్మి కలిసి చేలో కూలీ పనికి వెళ్లిన సమయంలో ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు వాటిని అదుపుచేసేందుకు విఫలయత్నం చేశారు. ఆహారం కోసం దాచుకున్న ఆరు బస్తాల ధాన్యం, కౌలుకు చేస్తున్న చేలో వేసేందుకు తెచ్చిన 12 వేల విలువైన యూరియా, డీఏపీ ఎరువు, అరకాసు బంగారం, రబీ పెట్టుబడి కోసం అప్పుగా తెచ్చి.. ఇంట్లో ఉంచిన రూ.20 వేల నగదు బూడిదయ్యాయి.
ప్రమాదంలో రూ.1.5 లక్షలు నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎగసిపడుతున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసేందుకు లైన్‌మెన్లు అందుబాటులో లేరని గ్రామస్తులు ఆరోపించారు. సంఘటనస్థలాన్ని తహశీల్దార్ ఎం.రవిబాబు, సర్పంచ్ కొండేపూడి సత్యప్రభ, సొసైటీ అధ్యక్షుడు సత్తి వీర్రాఘవరెడ్డి తదితరులు పరిశీలించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా పది కిలోల వంతున బియ్యాన్ని అందజేశారు.
రెక్కల కష్టం బుగ్గిపాలు
Published Wed, Jan 8 2014 6:27 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement