నాన్నకు ప్రేమతో ఎంతో చేయాలని ఉంది..
త్వరలో హీరోగా తెరంగేట్రం చేస్తా
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్
వెదురుపాక(రాయవరం) : నాన్న లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఏ పనిచేసినా ఆయనే గుర్తుకు వస్తున్నారు. కుగ్రామంలో జన్మించి సినీ ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని లి ఖించుకోవడమే కాదు.. మాకూ కొన్ని పేజీలు మిగిల్చి వెళ్లారు. నాన్నకు ప్రేమ తో.. గ్రామానికి ఎంతో చేయాలని ఉంది.. ఆలోచనలకు త్వరలోనే కార్యరూపం తీసుకువస్తానంటున్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. శనివారం రాయవరం మండలం వెదురుపాకలోని స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన తన భావాలను ఇలా వివరించారు.
‘సూర్యోదయం’ వేదికైంది..
నాన్న తన తల్లిదండ్రులు సూర్యనారాయణ, ఉదయభాస్కరం పేరిట వెదురుపాకలో ‘సూర్యోదయం’ నిర్మించారు. కుటుంబాల కలయికకు ఇది వేదికగా నిలుస్తోంది. అందుకే చెల్లెలు పద్మిని ప్రియదర్శిని సీమంతం వేడుకను ఇక్కడ చేస్తున్నాం.
నాన్నకు ప్రేమతో..
నాన్న సత్యమూర్తిపై ఉన్న ప్రేమతో గ్రామానికి ఏదైనా చేయాలని ఉంది. నాన్నకు చదువంటే ఎంతో ఇష్టం..గ్రామాన్ని విద్యాపరంగా చైతన్యం చేయాలని ఉంది. నాన్న పేరిట గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఉంది. ఆయన తొలి వర్ధంతి రోజును గ్రామంలో వేడుకగా చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం.
కొరటాల శివ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్‌తో నిర్మిస్తున్న ‘జనతా గ్యారేజ్’, క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, చిరంజీవి 150వ సిని మాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. 16 ఏళ్ల సినీ సంగీత ప్రస్థానంలో 70 సినిమాలకు సంగీతం అందించాను. ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాను. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని కోరారు. త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నా. నా తొలి ప్రాధాన్యం సంగీతానికి ఇవ్వడం వల్లనే నటనపై ఆసక్తి చూపలేదు.
టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు..
నా సినీ సంగీత ప్రయాణంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా. టాలెంటర్‌సతో ప్రోగ్రామ్స్ చేసి యూట్యూబ్‌లో పెట్టాలనే ప్రాజెక్టుకు కార్యరూపం తీసుకు వస్తాను. ఏ పనైనా ఇష్టంతో కష్టపడి చేస్తే పేరు దానంతట అదే వస్తుంది.
వెదురుపాకలో సోదరి సీమంతం వేడుక
వెదురుపాక (రాయవరం) : ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ శనివారం మండలంలోని వె దురుపాకలో హల్‌చల్ చేశారు. దేవిశ్రీప్రసాద్ తండ్రి ప్రముఖ సినీ కథా రచయిత సత్యమూర్తి మరణానంతరం తొలిసారిగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహానికి వచ్చారు.
సత్యమూర్తి తల్లితండ్రుల పేరుతో నిర్మించిన స్వగృహం ‘సూర్యోదయం’లో దేవిశ్రీ ప్రసాద్ సోదరి పద్మిని ప్రియదర్శినికి సీమంతాన్ని నిర్వహించారు. పద్మిని ప్రియదర్శినిని వేదమంత్రాల నడుమ దేవిశ్రీప్రసాద్ తల్లి శిరోమణి, సోదరులు దేవిశ్రీప్రసాద్, సాగర్, ఆమె భర్త వివేక్‌లు ఆశీర్వచనాలు అందజేశారు. ముత్తైవులు అంతా కలిసి సీమంతం పాటలు పాడుతూ ప్రియదర్శినికి పండంటి బిడ్డ జన్మించాలంటూ దీవెనలు అందజేశారు. ముందుగా సత్యమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు ఆచంట రాంబాబు, తులసి, కొమ్ముల బ్రహ్మానందం, సీతామహాలక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.