69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తం 11 కేటగిరీల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. మిగతా విభాగాల సంగతేమో గానీ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అలానే డీఎస్పీ కూడా 'పుష్ప' సాంగ్స్‌కి గానూ అవార్డు అందుకున్నాడు. అసలు వీళ్లిద్దరికీ కలిసొచ్చిన అంశాలేంటి?
పాటలు వైరల్
సినిమాలో కథ ఎలాంటిదైనా సరే జనాల్లో అంచనాలు పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ ముఖ్యం. ఆ విషయంలో 'పుష్ప' ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఎందుకంటే రిలీజ్ చేసిన ప్రతి పాట కూడా జనాలకు తెగ నచ్చేసింది. పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. శ్రీవల్లి, సామీ సామీ, ఏయ్ బిడ్డా, ఊ అంటావా మావ, దాక్కో దాక్కో.. ఇలా ప్రతి సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
(ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్)
విదేశాల్లోనూ హవా
అయితే 'పుష్ప' పాటలు తెలుగు వరకే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'పుష్ప' రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు, ఆ తర్వాత కూడా ఎక్కడా చూసిన పుష్ప పాటలకు డ్యాన్స్, రీల్స్ తెగ కనిపించాయి, వినిపించేవి. అలా పాటలన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
సినిమా కూడా
'పుష్ప' సినిమా రిలీజైన తొలిరోజు చాలామంది బాగోలేదని అన్నారు. కానీ వీకెండ్ పూర్తయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నార్త్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప' దెబ్బకు బన్నీ.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: కంగ్రాట్స్ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్)
బన్నీ ఊరమాస్
అల్లు అర్జున్ డిఫరెంట్ పాత్రలు చేయడంలో ఎక్స్‌పర్ట్. అయితే 'పుష్ప' కోసం మరింత కష్టపడ్డాడు. చిత్తూరు యాసతో పాటు డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కామెడీ, ఎమోషన్, ఫైట్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఆలోవర్ ఇండియా అల్లు అర్జున్‌కి ఫిదా అయింది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు వరించింది. 'పుష్ప' సీక్వెల్లో.. 'ఇది 'పుష్ప'గాడి రూలు' ఓ డైలాగ్ ఉంది. ఆ మూవీ రిలీజ్‌కి ముందే జాతీయ అవార్డుల్లో ఆ మాట నిజమైంది. ఎందుకంటే 'పుష్ప' రూల్ చేసి పడేశాడుగా.
ఇలా పైన చెప్పిన అంశాలతోపాటు సుకుమార్ డైరెక్షన్, రష‍్మిక యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఇలా చాలా అంశాలు కలిసొచ్చాయి. దీంతో జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ నిలిచారు. తెలుగు సినిమా స్థాయిని అందనంత ఎత్తుకి పెంచేశారు.
(ఇదీ చదవండి: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment