జంపన్నవాగులో మృత్యు కుహరాలు
మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో పలువురు ప్రమాదవశాత్తు జంపన్నవాగులో మునిగి మృతి చెందుతున్న దుర్ఘటనలు ఏటా వర్షాకాలంలో చోటు చేసుకుంటున్నాయి.
-
l భక్తుల పాలిట ప్రమాదకరంగా
-
పరిణమిస్తున్న నీటి మడుగులు
-
l హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో
-
వాటిని గుర్తించలేకపోతున్న భక్తులు
-
l ఇటీవల ఒకరి గల్లంతు
-
l ఇంకా తెలియని ఆచూకీ
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో పలువురు ప్రమాదవశాత్తు జంపన్నవాగులో మునిగి మృతి చెందుతున్న దుర్ఘటనలు ఏటా వర్షాకాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలను నివారించే దిశగా మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటివరకు జంపన్నవాగు వద్ద కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా జంపన్నవాగులో వరద ఉధృతి పెరుగుతోంది. దానితాకిడికి వాగులోని ఇసుక కొట్టుకుపోయి అక్కడక్కడ నీటి మడుగులు ఏర్పడుతున్నాయి. అవే భక్తుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఈవిషయం సంబంధిత అధికారులకు తెలిసినా..పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
గతేడాది ఇద్దరి మృతి..
వాగులో నీటి మడుగులు ఉన్నాయనే విష యం తెలియకపోవడంతో..స్నానం చేసేందు కు వచ్చే భక్తులు వాటిలో చిక్కుకొని మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఇదే సమయంలో వన దేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భూపాల్‌పల్లికి చెందిన చిలువేరు శ్రీధర్ మృతిచెందాడు. కొత్తూరులోని బంధువుల ఇంటికి వచ్చిన ఖిలా వరంగల్‌వాసి గోపిశెట్టి శ్రీకాంత్ స్నానం చేసేందుకు వాగులోకి దిగి,నీట మునిగి దుర్మరణం పాలయ్యాడు. తాజాగా గత ఆదివారం వరంగల్ పట్టణానికి చెందిన గుంటోజు శ్రీధర్ వాగులో మునిగి గల్లంతయ్యాడు. ఎస్సై కరుణాకర్‌రావు ఆధ్వర్యంలో రెండు రోజులుగా అతడి ఆచూకీ కోసం మేడారం నుంచి మొదలుకొని ఏటూరునాగారం జంపన్నవాగు వరకు జాలర్లు, గ్రామస్తులు, గత ఈతగాళ్ల సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినా ఇప్పటివరకు శ్రీధర్ ఆచూకీ లభించలేదు. దీంతో బాధిత కుటుంబీకులు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు.
సంకటంగా మారుతున్న సరదా..
జంపన్నవాగులో నీటి మడుగులు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దైవ దర్శనం కోసం మేడారానికి ప్రతి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు వందలాదిగా తరలి వస్తుంటారు. దేవతలను దర్శించుకునేందుకు ముందుగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వర్షాలకు వాగులోకి నీళ్లు భారీగా చేరుతుండటంతో, భక్తులు సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగుతుంటారు. ఆ సరదా వారి పాలిట సంకటంగా మారుతోంది. వాగులోని నీటి మడుగుల్లో మునిగిపోయి మృతిచెందుతున్నారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి
నీటిమడుగులు ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది.
– సిద్ధబోయిన జగ్గారావు, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు