2019లో నేనే ముఖ్యమంత్రిని : జానా
కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎల్పీ నేత జానారెడ్డి మరోమారు తన మనసులో మాట బయటపెట్టుకున్నారు. ఎప్పటికైనా సీఎం కావాలనేది తన రాజకీయ ఆకాంక్ష అనే అంశాన్ని మరోమారు చెప్పకనే చెప్పారు. శుక్రవారం నాగార్జున సాగర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరు పార్టీలో నుంచి వెళ్లిపోయినా..
నేనున్న స్థాయిలో ఎవరినీ దూషించలేనని, పార్టీలో ఉన్న వారికి అండగా ఉంటానని, సీఎం ఎవరైనా నేను సీఎంతో సమానమైన మనిషినని, స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని, అప్పుడు నేను సీఎం అయినట్లేనని, నేనే సీఎంనని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో పెద్ద కలకలాన్నే లేపింది.
గతంలో తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్‌లో ఉపాధ్యాయులుఘెరావ్ చేసిన సందర్భంగా కూడా జానా ఈ విధమైన వ్యాఖ్యలే చేశారు. ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తెలంగాణ వస్తే సీఎంను అయ్యేది తానేనని చెప్పారు. మళ్లీ ఇప్పుడు జానా సీఎం పదవి గురించి వ్యాఖ్యానించడం అటు జిల్లాలో, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.