జనతన సర్కారు వర్ధనరావు ఆకాంక్ష
సంస్మరణ సభలో విరసం నేత వరవరరావు
తెనాలి: జనతన సర్కారు సాకారం కావాలనే కాంక్షతో తానే ఒక విప్లవ పాఠశాలగా పనిచేసిన పీజే వర్ధనరావు విప్లవ కృషీవలుడని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన కన్నుమూసిన విప్లవ రచయిత, సామాజిక ఉద్యమకారుడు పీజే వర్ధనరావు సంస్మరణ సభను ఆదివారం రాత్రి కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో నిర్వహించారు. భిన్నస్వరాలు, సాహితీ సాంస్కృతిక వేదిక, శారద సాహిత్య వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు పిల్లి వాసు అధ్యక్షత వహించారు. వరవరరావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసిన వర్ధనరావు 1964–67 మధ్య చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం, నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రభావంలోకి వచ్చినట్టు చెప్పారు. తన 20వ ఏటనే తెనాలిలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా చేరిన దగ్గర నుంచి తుదిశ్వాస వరకు 45 ఏళ్లకు పైగా విప్లవోద్యమమే ఆచరణగా, ఆలోచనగా, ఆకాంక్షగా జీవించారని అన్నారు. 1978లో గుంటూరులో జరిగిన రాడికల్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై, రాష్ట్రవ్యాప్తంగా ‘గ్రామాలకు తరలండి’ అనే క్యాంపెయిన్ నిర్వహించి, ఎన్నో నిర్బంధాలు, చిత్రహింసలు, దాడులను వర్ధనరావు ఎదుర్కొన్నారని గుర్తుచేసుకున్నారు. దండకారణ్యంలో నిర్మాణమవుతున్న జనతన సర్కారును సాకారం చేసుకుందామన్న ఆకాంక్షతో కన్నుమూసిన విప్లవ మేస్టారుకు విప్లవ జోహార్లు చెప్పారు. వరంగల్‌కు చెందిన డాక్టర్ గోపీనాథ్, జేఎస్‌ఆర్ కృష్ణయ్య, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, ఎంవీ ప్రసాదరావు, ప్రమీల, ప్రదీప్, రవి మాట్లాడారు. ఉమారాజశేఖర్ స్వాగతం పలికారు.