భర్తను కఠినంగా శిక్షించాలి
పిల్లలకు న్యాయం చేయాలి
మృతురాలి తల్లి, సోదరి డిమాండ్
అనంతపురం సెంట్రల్ : తన వివాహేతర సంబంధానికి తరచూ అడ్డు తగులుతున్నందునే ఉపాధ్యాయురాలు జయశ్రీని భర్త జనార్ధన్ పథకం ప్రకారం హత్య చేశాడని ఆమె తల్లి లక్ష్మిదేవి, అక్క, మాజీ కార్పొరేటర్ పావురాల కిష్ట భార్య పూర్ణమ్మ ఆరోపించారు. నగరంలోని నీరుగంటివీధిలో గల తమ నివాసంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనార్ధన్ పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జయశ్రీకి నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దిచెప్పాలని చూసిన తమను కూడా ఇష్టానుసారం దూషించేవాడని కన్నీటి పర్యంతమయ్యారు.
ఎప్పటికైనా మారుతాడులే అని భావించామని, కానీ ఇంతటి దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేకపోయామని అన్నారు. జయశ్రీకి భర్త అంటే ఎంతో ప్రాణమన్నారు. భర్త వేధింపులకు ఫిర్యాదు చేద్దామంటే వద్దనేదని గుర్తు చేసుకున్నారు. ముందే పోలీసులను ఆశ్రయించి ఉన్నా ఆమె ప్రాణాలతో దక్కేదని వాపోయారు. అన్యాయంగా జయశ్రీని పొట్టన పెట్టుకున్న జనార్ధన్‌కు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. తల్లిని కోల్పోయిన ప్రగతిశ్రీ, వివేక్ శబరీష్‌లకు న్యాయం చేయాలని ఎస్పీ రాజశేఖర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ఆస్తిపాస్తులు, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ పిల్లలకు వర్తింపజేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుకు వచ్చి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే ఎస్పీని కలుస్తామన్నారు.
పథకం ప్రకారమే జయశ్రీ హత్య
Published Sun, Oct 2 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
Advertisement
Advertisement