ఏఈ పేపర్‌ ‘చూపించడానికి’ రూ.2 లక్షలు! | SIT police arrested father and son in TSPSC Question Paper Leakage Case | Sakshi
Sakshi News home page

ఏఈ పేపర్‌ ‘చూపించడానికి’ రూ.2 లక్షలు!

Published Sat, Apr 22 2023 5:48 AM | Last Updated on Sat, Apr 22 2023 2:48 PM

SIT police arrested father and son in TSPSC Question Paper Leakage Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గండేడ్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులను శుక్రవారం సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న లవడ్యావత్‌ డాక్యానాయక్‌కు రూ.2 లక్షలు చెల్లించి అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) ప్రశ్నపత్రాన్ని ‘చూసి రాసిన’అభ్యర్థి జనార్దన్‌తోపాటు ఈ డబ్బు ఇచ్చిన అతడి తండ్రి మైబయ్య పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య 19కి చేరింది.

కమిషన్‌ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పిలిదిండి ప్రవీణ్‌ కుమార్, నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి కుమ్మక్కై పలు పరీక్షల ప్రశ్నపత్రాలు(మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్స్‌) తస్కరించినట్లు సిట్‌ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. వీటిలో ఏఈ పేపర్‌ను ప్రవీణ్‌కుమార్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా పగిడ్యాల పంచాంగల్‌ తండాకు చెందిన భార్యభర్తలు రేణుక, డాక్యాలకు విక్రయించాడు.

కాగా, వికారాబాద్‌ జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గండేడ్‌ మండలం జంగంరెడ్డిపల్లికి మైబయ్యతో అదే శాఖలో పనిచేసిన డాక్యాకు ఇదివరకే పరిచÄయం ఉంది. మైబయ్య కుమారుడు జనార్దన్‌ కూడా ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మార్చి 3న పరీక్ష పేపర్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తానని డాక్యా చెప్పగా, తన వద్ద అంత మొత్తం లేదని చెప్పి మైబయ్య తొలుత రూ.2 లక్షలు ఇచ్చాడు.  

పరీక్ష పేపర్‌ చూడు.. ప్రశ్నలు గుర్తుపెట్టుకో... 
డాక్యా మార్చి 4న జనార్దన్‌ను తన ఇంటికి పిలిచి పరీక్షపత్రంలోని ప్రశ్నలు చూపించాడు. తాను కోరి నట్లు రూ.6 లక్షలు చెల్లిస్తే జిరాక్సు ప్రతి ఇచ్చేవాడినని, రూ.2 లక్షలే ఇవ్వడంతో పేపర్‌ చూసుకుని ప్రశ్నలు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నానని జనార్దన్‌కు డాక్యా చెప్పాడని తెలిసింది. అయితే డాక్యాసహా ఇతర నిందితులు అరెస్టు, విచారణలో మైబయ్య, జనార్దన్‌ గురించి చెప్పలేదు. సిట్‌ పోలీసులు మార్చి మొదటివారంలో డాక్యా ఇంటి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌తోపాటు ఇతర కాల్స్‌ వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే డాక్యా, మైబయ్యకు మధ్య ఉన్న లింకు బయటపడింది. మైబయ్య కుమారుడు జనార్దన్‌ పరీక్ష రాసినట్లు తేలింది. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏఈ పరీక్షపత్రం ‘చూసి రాసిన’వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకోవాలని, ఇతర లింకులపై విచారించాలని సిట్‌  నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement