సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి.
ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్‌మెంట్‌లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా... రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు.
సురేశ్ ద్వారా మొత్తం 14 పేపర్లు చేరినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వీరిలో దళారులతోపాటు అభ్యర్థులూ ఉన్నారు. మరోపక్క రవికిశోర్ ఏఈ సివిల్ పేపర్లను తమ బంధువులకు ఉచితంగా ఇవ్వడంతోపాటు బయటి వారికి అమ్మినట్లు గుర్తించారు. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను రూ.3 లక్షలకు కొనేందుకు ఒప్పందం చేసుకుని, రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించిన భరత్ నాయక్‌ను, వరంగల్‌కు చెందిన బంధువులు పసి కాంతి రోహిత్‌కుమార్, గాడె సాయి మధులను గురువారం అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాలు సొంతం చేసుకుని రాసిన వారిలో చాలామందికి అత్యధిక మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment