చందంపేట (నేరడుగొమ్ము) : చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో ఓ వైపు చుట్టూ దట్టమైన అడవులు.. మరోవైపు నాగార్జునసాగర్ కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా చుట్టూ నీరు, రకరకాల పక్షుల కిలకిలరావాలతో ఎటు చూసినా మనసును పులకరింపచేసే అందాలే. ఇవేకాక భక్తి పారవశ్యానికి నిదర్శంగా నిలిచే అతి పురాతనమైన దేవాలయాలు.. 13వ శతాబ్ధంలో రాజులు, మునులు తపస్సు చేసిన ఆనవాళ్లు, గిరిజన సంస్కృతీ స్పష్టంగా కన్పిస్తుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే అరకు తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని నేరడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామపంచాయతీ వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా చేస్తే దేవరకొండ ప్రాంతంలోని చందంపేట, నేరడుగొమ్ము మండలాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనే ఉద్దేశంతో జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. ఇక్కడ పర్యటించిన మంత్రులూ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా పుష్కరాల సమయంలో రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ ప్రాంతంలో పర్యటించి వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో రాష్ట్ర అటవీశాఖా మంత్రి జోగు రామన్న, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలు కూడా చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో పర్యటించి వారు కూడా ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారని సమాచారం.
పర్యాటక ప్రాంతమైతే..
చందంపేట, నేరడుగొమ్ము ఉమ్మడి మండలాల్లో 26,785 హెక్టార్లలో నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. నాగార్జునసాగర్ - కృష్ణా నది పరివాహక బ్యాక్ వాటర్ చందంపేట, నేరడుగొమ్ము మండలాలకు ఆనుకుని ఉంది. పురాతన దేవాలయాలు, అరకు అందాలు, చక్కటి రమణీయమైన దృశ్యాలు వీటన్నింటికి మించి ఇక్కడ కాచరాజుపల్లి గ్రామంలో బొర్రా గుహలను తలపించే నీలివర్ణం, ఆకుపచ్చని వర్ణంలో అతిపెద్ద గుహలూ ఉన్నాయి . దేవరచర్ల మునిస్వామి ఆలయం ప్రతి నిత్యం శివలింగంపై కొండచరియల నుంచి సంవత్సరం పొడుగునా నీళ్లు జాలువారుతుంటాయి . అంతే కాకుండా వైజాగ్ కాలనీ నుంచి బోటింగ్‌ను ఏర్పాటు చేసి నాగార్జున కొండ, ఏలేశ్వరం మల్లయ్యగట్టుకు లాంచీలను ఏర్పాటు చేస్తే ఇటు గిరిజన గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని ఇక్కడి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రూపురేఖలు మారిపోతాయి
వైజాగ్ కాలనీ పర్యాటక ప్రాంతమయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి . గతంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్, అటవీశాఖా మంత్రి జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లా. సీఎం సానుకూలంగా స్పందించారు. అటవీశాఖ నుంచి పర్యావరణ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేరుుంచి వీలైనంత త్వరలో ఉమ్మడి చందంపేట మండలం పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి చేస్తా.
- నేనావత్ బాలునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్
ఉమ్మడి మండలం పర్యాటక ప్రాంతమయ్యేనా..?
Published Sun, Dec 11 2016 3:48 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
Advertisement
Advertisement