tribal culture
-
ఆదివాసీ, గిరిజనానికి ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన జంట భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు(ఈనెల 17న) ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏర్పాట్లను అత్యంత ఘనంగా చేపట్టింది. భవనాల ప్రారంభోత్సవానికి ఆయా వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోంది. గిరిజన గూడేలు, ఏజెన్సీ గ్రామాలు, తండాల్లోని పంచాయతీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. ఆదివాసీ తెగలు, గిరిజన పౌరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అందులో సూచించింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హైదరాబాద్‌లో జంట భవనాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సూచి స్తూ, ఆయా ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని సైతం కల్పించింది. జంట భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే గిరిజన మహాసభను విజ యవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఒక్కో భవనానికి రూ. 22 కోట్లు... మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఈ రెండు భవనాల కోసం ఎకరా స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణంకోసం రూ.44 కోట్లు కేటాయించింది. ఓక్కో భవనానికి రూ.22 కోట్లు చొప్పున ఖర్చు చేసింది. ఒక్కో భవనంలో సగటున వెయ్యి మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించింది. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అక్కడే వసతి కల్పించేలా గదులు ఉన్నాయి. ఆయా భవనాల్లోకి ప్రవేశించగానే వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బొమ్మలు, కళాత్మక చిత్రాలను కూడా ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం కోసమే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈనెల 17న ముహూర్తం కుదరడంతో.. రేపు ఆ రెండు భవనాలు ప్రారంభం కానున్నాయి. -
భావి తరాలకు పదిలంగా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరానికి అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గిరిజన తెగల సంస్కృతి, భాషల అధ్యయనం విస్తృతంగా సాగుతోంది. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వీడియో డాక్యుమెంటేషన్ చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది. గిరిజనుల వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని రాబోయే తరాలకు తెలియజేయడం కోసం గిరిజన వస్తు ప్రదర్శనశాలలు(మ్యూజియం)ను ఏర్పాటు చేసింది. అరకులోయ, శ్రీశైలం, సీతంపేట(శ్రీకాకుళం జిల్లా)లో గిరిజన వస్తు ప్రదర్శనశాలలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సాహిత్యం, వాజ్ఞయాలతో కూడిన 15 వేలకు పైగా పుస్తకాలను రూపొందించడంతోపాటు, వాటిలోని చాలా వరకు డిజిటలైజేషన్ చేసింది. గ్లోబలైజేషన్ యుగంలో వివిధ గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన చర్చాగోష్టిలో సమర్పించిన పత్రాలను నాలుగు సంపుటాలుగా వెలువరించింది. గిరిజన బడుల్లో 1 నుంచి 3వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంది. కోయ, ఆదివాసి, సుగాలి, కొండ, సవరా, భారతి, కువి, భాషల్లో 54 వాచకాలు రూపొందించి గిరిజన విద్యార్థులకు అందించింది. బడగ, గదబ, కొండకాపు, గౌడు, కొఠియా, రోనా, భిల్లు, పరంగి పోర్జా, పోర్జా, మాలి, ధూలియా, కట్టునాయకన్, యానాది వంటి గిరిజన తెగలకు చెందిన వారి సంస్కృతి భాష, ఇతర సంప్రదాయాలపై సమగ్ర అధ్యయనాలను చేపట్టింది. కొండరెడ్డి, కోండ్, గదబ, చెంచు, కొరజ, సవర, జాతాపు, నక్కల, కోయ, వాల్మీకి తెగల ఆచార వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయక పరిజ్ఞానాన్ని పరిరక్షించడం కోసం వారి జీవన శైలిని వీడియో రూపంలో డాక్యుమెంటేషన్ చేయడం విశేషం. ఏటా గిరిజనోత్సవాలు గిరిజన సంస్కృతిని వెలుగులోకి తేవడంతోపాటు గిరిజన స్వాతంత్య్ర పోరాటాలను స్మరించుకోవడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా గిరిజనోత్సవాలను నిర్వహిస్తోంది. అలాగే ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ జాతర, జూలై 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది. గిరిజన కళలను ప్రోత్సహించేందుకు అనేక పోటీలు, ఔత్సాహిక కార్యక్రమాలను చేపడుతోంది. గిరిజన నాట్య బృందాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే గిరిజన ఉత్సవాల్లో పోటీలకు పంపిస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో 2019లో జరిగిన జాతీయ గిరిజన నృత్యోత్సవంలో రాష్ట్రానికి చెందిన ‘కొండరెడ్ల కొమ్ము’ నాట్యానికి 3వ బహుమతి వచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం.. సీఎం జగన్ ఆదేశాలతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాం. గిరిజన తెగలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, వేషభాషలు, సంగీత, నాట్య పరికరాలు, వ్యవసాయ పరికరాలు, కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సేకరించి మ్యూజియంలతోపాటు, వీడియోలు, ఫొటోలు, డిజిటలైజేషన్ తదితర రూపాల్లో అందుబాటులోకి తెస్తున్నాం. మరింత పరిజ్ఞానం తెలుసుకునేలా అధ్యయనం చేపట్టడంతోపాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
ఆదివాసీల ‘ఆఖరి మజిలీ’ ప్రత్యేకం
సాక్షి, మంచిర్యాల: మైదాన ప్రాంతవాసులతో పోలిస్తే ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. పుట్టుక, పెళ్లి, చావు.. ఇలా అన్నింటా వారికి ప్రత్యేక జీవనశైలి ఉంది. సాధారణంగా ఎవరైనా కాలం చేస్తే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, తెలిసినవారితో కలసి అంతిమ వీడ్కోలు పలికి ఇల్లు చేరుతుంటారు. కానీ, ఈ వ్యవహారంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని గోండు తెగ సంప్రదాయం వేరు. మృతదేహం చితిలో పూర్తిగా కాలిపోయి.. బూడిదగా మారేవరకూ(నీర్పూజ) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అర్ధరాత్రి తర్వాత కాష్టం చుట్టూ తిరుగుతూ సంప్రదాయ వాయిద్యాలు, డప్పులు మోగిస్తూ, ప్రత్యేక గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తారు. చనిపోయినవ్యక్తిని ఈ పాటల్లో కీర్తిస్తూ స్వర్గప్రాప్తి కలగాలని కోరుతారు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చి బతికి చనిపోయినవారి చివరి మజిలీలో ఇదే ఆఖరిఘట్టంగా భావించి ‘ఆత్మకు శాంతి’ చేకూరేలా ఆడి పాడి ఈ క్రతువు పూర్తిచేస్తారు. ఇలా చేస్తే చనిపోయినవారి ఆత్మ స్వర్గంలో శాంతిస్తుందని గిరిజనుల నమ్మకం. ఈ తంతులో మహిళలు తప్ప కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఆడి పాడే సమయంలో అక్కడే మేకను బలి ఇస్తారు. వంట చేసుకుని సంప్రదాయ సంగీతం మధ్య ఆడుతూపాడుతూ అక్కడే భోజనం చేస్తారు. ఇదంతా సూర్యోదయం వరకు కొనసాగుతుంది. అనాదిగా ఆదివాసీల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. తాజాగా... ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయిలో ఆత్రం బొజ్జు పటేల్ మరణించారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘనంగా అంతిమయాత్ర పూర్తి చేశారు. తర్వాత అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు సంప్రదాయ తంతు నిర్వహించారు. కాగా, దేహాన్ని కాల్చకుండా మట్టిలో పూడిస్తే మాత్రం ఈ తరహా కార్యక్రమాలు ఉండవు. అనాదిగా వస్తున్న ఆచారం చితిలో కాలిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం చేస్తాం. అనాదిగా ఈ ఆచారం పాటిస్తున్నాం. ఇలా చేస్తే చనిపోయిన వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని నమ్మకం. – మెస్రం షేకు, దబోలి, జైనూరు మండలం, ఆసిఫాబాద్ జిల్లా -
తొలి ‘ట్రైబల్ క్వీన్’గా పల్లవి దరువా
భువనేశ్వర్ : భారతదేశ తొలి ట్రైబల్ క్వీన్‌గా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాకు చెందిన పల్లవి దరువా చరిత్ర సృష్టించారు. ఆది రాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని ఓడించి ఆమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్ ఫేస్, బెస్ట్ స్కిన్, బెస్ట్ పర్సనాలిటీ వంటి ఏడు విభిన్న విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచారు. ఈ పోటీలో టిట్లాఘడ్‌కు చెందిన పంచమీ మజీ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మయూర్‌భంజ్‌కు చెందిన రష్మీరేఖా హన్స్దా రెండో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక ఉత్కళ్ మండపంలో జరిగిన ఈ పోటీలో ‘పద్మశ్రీ’ తులసి ముండా నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయించారు. సమయం ఆసన్నమైంది... ‘చాలా మంది గిరిజన బాలికలు, మహిళలకు నాలాగా ఈ విధంగా బయటి ప్రపంచంలోకి రావడం, చదువుకోవడం వంటి అవకాశాలు దక్కడం లేదు. ట్రైబల్ క్వీన్‌గా కిరీటాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ వారందరికీ నేనొక చక్కని ఉదాహరణగా నిలుస్తానని అనుకుంటున్నాను. మూఢనమ్మకాలు వదిలేసి.. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చేసిందంటూ’ ట్రైబల్ క్వీన్ పల్లవి దరువా పిలుపునిచ్చారు. చరిత్ర సృష్టించాం... విజేతలను ప్రకటించిన అనంతరం అవార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి చిదాత్మిక ఖట్వా మాట్లాడుతూ... ‘ఈరోజు మేము చరిత్ర సృష్టించాం. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతిని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన పోటీ కానే కాదు. కేవలం కళలు, నృత్యరీతుల ద్వారానే కాకుండా గిరిజన మహిళలకంటూ ఒక సొంత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోటీ నిర్వహించాం. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడవడం, అందరి ముందు అభిప్రాయాలను వెల్లడించడం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంటూ’ వ్యాఖ్యానించారు. -
మముగను తల్లీ శీత్లా !
సంస్కృతి ∙ ప్రతి తండాలో దాటుడు పండుగ – విత్తనాలు వేయగానే పండుగకు శ్రీకారం ∙ సమృద్ధిగా పంటలు పండాలని మొక్కులు ∙ గిరిజన సాంప్రదాయాల మధ్య అడవి తల్లికి పూజలు తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి లంబాడాల ఆచార వ్యవహారాలు ప్రత్యేకం. అడవిలో ప్రతి చెట్టు, పుట్ట, రాయి. గుట్ట అన్నీ వారికి ఆరాధ్య దైవాలే.. అంతా అ దేవుడిపైనే భారం. బిడ్డ పుట్టిన నాటి నుండి పెరగడం, పెళ్లి ఇలా అన్ని శుభకార్యాలూ ఆ అమ్మవారి చలువతోనే జరుగుతాయని నమ్మకం. చివరకు చనిపోయినా.. ప్రత్యేక పూజలు చేస్తారు. తొలకరి జల్లులు పడగానే పుడమి తల్లి ఒడిలో విత్తనాలు వేసి, అవి సక్రమంగా మొలకెత్తాలని, పశువులు పరిపుష్ఠిగా ఉండి వ్యవసాయానికి ఉపయోగపడాలని. పంటలు సమృద్ధిగా పండాలని శీత్లా భవాని అమ్మవారిని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాడం, శ్రావణ మాసాల్లోని మంగళవారంలో జరుపుకునే శీత్లా భవాని(దాటుడు పండుగ)పండుగ గిరిజన తండా పండుగల్లో కీలకమైనది. పశువులకు, మనుషులకు, పంట చేలకు వ్యాధులు రాకూడదని, ఏ దుష్టశక్తి కూడా తమ వైపు చూడకూడదని శీత్లా భవాని అమ్మవారిని కోరుతూ పండుగ జరుపుకుంటారు. పునాస పంటలతో పచ్చటి రంగేసుకున్న పుడమి తల్లి ఒడిలో రంగురంగుల దుస్తులు, కళ్లు మిరిమిట్లు గొలిపే అద్దాల ముసుగులు, ముంజేతి గాజులు, ఘల్లుఘల్లుమనే కాళ్ల కడియాలతో అందంగా అలంకరించుకొని యువతీయువకులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ శీత్లా భవాని పండుగ. వేడుక ఇలా.. శీత్లా భావాని అమ్మవారికి మంగళవారం ఉత్సవాలు జరుపుతారు. దీనిని గొడ్లదాటుడు పండగ అని కూడ పిలుస్తారు. తండా పెద్ద నిర్ణయం ప్రకారం పండుగకు ఒక రోజు ముందుగా రాత్రి వాసిడో.. వాసిడో..(పాత గుగ్గిళ్లు) అని కేకవేస్తూ ఒక వ్యక్తి తండాలోని వీధి వీధి తిరుగుతాడు. అంటే రేపు పండుగ చేయాలని అర్థం. తండా శివారులో రావి, వేప, మోదుగు చెట్టుకింద ఏడు రాతి బండలను నిలువున పాతి పెట్టి (అమ్మవారి ఏడు ప్రతి రూపాలు ఏడు బండలు) ఎర్రటి మట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు. తమ వ్యవసాయ భూముల్లో పండిన ధాన్యాలు మక్కలు, బొబ్బర్లు, సెనగలు కలిపి గుడాలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని తీసుకొని గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిపై నైవేద్యం పెట్టుకొని నృత్యాలు చేసుకుంటూ శీత్లా భవాని పండుగ జరిపే ప్రాంతాలకు వస్తారు. నంతరం అక్కడ ఉన్న కుల పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. శీత్లా భవానికి వేట బలి ఇస్తారు. రక్తంలో ధాన్యాలను కలిపి పశువుల పై చల్లుతారు. అనంతరం గిరిజన మహిళలు శీత్లా భవానికి తెచ్చిన నైవేద్యాలను ఒక దగ్గర పెట్టి లంబాడీ భాషలో గేయాలు అలపిస్తూ ఆనందంగా నృత్యాలు చేస్తారు. – భిక్షం, సాక్షి, సిద్ధిపేట -
నాగోబా జాతరకు రూ.40 లక్షలు
మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్యదైవం ఆదిలాబాద్ జిల్లా ఖెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.40 లక్షలు విడుదల చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సమ్మక్క, సారలమ్మల తర్వాత పెద్దదైన నాగోబా జాతరకున్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా వచ్చే నెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ జాతరకు ప్రభుత్వం తరఫున ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సచివాలయంలో జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నతో కలసి చందూలాల్ సమీక్షించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధి కారులను ఆదేశించారు. ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతరకు శాశ్వత ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు. ఎస్టీ సంక్షేమ శాఖ నుంచి రూ. 2కోట్లతో ధర్మసత్రం, దర్బార్ హాలు, ఇతర ఏర్పాట్లను చేపట్టను న్నట్లు చందూలాల్ తెలియజేశారు. మండప ఆధునీకరణ, రాజగోపుర నిర్మాణాలు, దేవాలయ పునరు ద్ధరణకు రూ.1.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి తెలి పారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాబూరావు పాల్గొన్నారు. -
ఉమ్మడి మండలం పర్యాటక ప్రాంతమయ్యేనా..?
చందంపేట (నేరడుగొమ్ము) : చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో ఓ వైపు చుట్టూ దట్టమైన అడవులు.. మరోవైపు నాగార్జునసాగర్ కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా చుట్టూ నీరు, రకరకాల పక్షుల కిలకిలరావాలతో ఎటు చూసినా మనసును పులకరింపచేసే అందాలే. ఇవేకాక భక్తి పారవశ్యానికి నిదర్శంగా నిలిచే అతి పురాతనమైన దేవాలయాలు.. 13వ శతాబ్ధంలో రాజులు, మునులు తపస్సు చేసిన ఆనవాళ్లు, గిరిజన సంస్కృతీ స్పష్టంగా కన్పిస్తుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే అరకు తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని నేరడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామపంచాయతీ వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా చేస్తే దేవరకొండ ప్రాంతంలోని చందంపేట, నేరడుగొమ్ము మండలాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనే ఉద్దేశంతో జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. ఇక్కడ పర్యటించిన మంత్రులూ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా పుష్కరాల సమయంలో రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ ప్రాంతంలో పర్యటించి వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో రాష్ట్ర అటవీశాఖా మంత్రి జోగు రామన్న, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలు కూడా చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో పర్యటించి వారు కూడా ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారని సమాచారం. పర్యాటక ప్రాంతమైతే.. చందంపేట, నేరడుగొమ్ము ఉమ్మడి మండలాల్లో 26,785 హెక్టార్లలో నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. నాగార్జునసాగర్ - కృష్ణా నది పరివాహక బ్యాక్ వాటర్ చందంపేట, నేరడుగొమ్ము మండలాలకు ఆనుకుని ఉంది. పురాతన దేవాలయాలు, అరకు అందాలు, చక్కటి రమణీయమైన దృశ్యాలు వీటన్నింటికి మించి ఇక్కడ కాచరాజుపల్లి గ్రామంలో బొర్రా గుహలను తలపించే నీలివర్ణం, ఆకుపచ్చని వర్ణంలో అతిపెద్ద గుహలూ ఉన్నాయి . దేవరచర్ల మునిస్వామి ఆలయం ప్రతి నిత్యం శివలింగంపై కొండచరియల నుంచి సంవత్సరం పొడుగునా నీళ్లు జాలువారుతుంటాయి . అంతే కాకుండా వైజాగ్ కాలనీ నుంచి బోటింగ్‌ను ఏర్పాటు చేసి నాగార్జున కొండ, ఏలేశ్వరం మల్లయ్యగట్టుకు లాంచీలను ఏర్పాటు చేస్తే ఇటు గిరిజన గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని ఇక్కడి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూపురేఖలు మారిపోతాయి వైజాగ్ కాలనీ పర్యాటక ప్రాంతమయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి . గతంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్, అటవీశాఖా మంత్రి జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లా. సీఎం సానుకూలంగా స్పందించారు. అటవీశాఖ నుంచి పర్యావరణ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేరుుంచి వీలైనంత త్వరలో ఉమ్మడి చందంపేట మండలం పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి చేస్తా. - నేనావత్ బాలునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ -
గిరిజన సంస్కృతికి ప్రతీక.. తీజ్
శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చిట్యాల : తీజ్ పండుగ గిరిజనుల సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని భావుసింగ్పల్లిలో సర్పంచ్ అజ్మీరా జ్యోతి ఆధ్వర్యంలో గురువారం తీజ్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భం గా గిరిజన యువతులు గోధుమ బుట్టలతో నృత్యా లు చేసిన అనంతరం ప్రదర్శనగా వెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమానికి హాజరైన స్పీ కర్ మాట్లాడుతూ సంప్రదాయాన్ని మరిచిపోకుం డా గిరిజనులు తీజ్ ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అలాగే, ఎంపీటీసీ అజ్మీరా శారద, కాంగ్రెస్ నాయకుడు అజ్మీ రా దేవేందర్ ఆధ్వర్యంలో అదే గ్రామంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో రవీందర్, అజ్మీరా శ్రీనివాస్, అజ్మీరా శ్రీను, రా జు, దేవేందర్, కుంచాల సదావిజయ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, గణపతి, సధాకర్, సంపత్, శం కర్, లసుమయ్య, సదానందం పాల్గొన్నారు. -
నేడు మండ మెలిగె
ఏర్పాట్లు పూర్తిచేసిన పూజారులు చుట్టాలతో కళకళలాడుతున్న మేడారం ములుగు : మేడారం మహా జాతరకు వారం రోజుల ముందు నిర్వహించే పండుగ మండ మెలిగె. బుధవారం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా వన దేవతల పూజారులు మండమెలిగె పండుగను నిర్వహించనున్నారు. మండమెలిగె అనంతరం సరిగ్గా వారానికి (వచ్చే బుధవారం) సారలమ్మ తల్లి గద్దెపైకి రావడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో మండమెలిగె పండుగను ఘనంగా నిర్వహించేందుకు పూజారులు సిద్ధమయ్యారు. ఉదయం మహిళలు తమ ఇళ్లను ముస్తాబుచేస్తారు. పుట్టమట్టితో అలుకుతారు. ఆ తర్వాత అడవికి వెళ్లి గడ్డిని సేకరించి తీసుకొస్తారు. గడ్డిని గుడిపై పెడతారు. అక్కడి నుంచి మేడారం ప్రారంభ ద్వారం వద్ద, ఆలయ ప్రవేశమార్గం ముందు దొరటంబాలు (దిష్టితగల కుండా ఏర్పాటు చేసే ద్వార స్తంభం) లేపుతా రు. ద్వారానికి ఆనక్కాయ, మామిడి తోరణం, కోడిపిల్లను కడతారు. అక్కడి నుంచి గ్రామ దేవతలకు మొక్కు చెల్లిస్తారు. పూజారి సిద్ధబోయిన మునీందర్ఇంట్లో నుంచి పూజా సామగ్రిని సమ్మక్క గుడికి తీసుకెళ్తారు. అనంతరం అక్కడ అమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించి గద్దెల పైకి తీసుకెళ్తారు. మహిళలు రోజంతా ఉపవాసం ఉంటారు. మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క ఆలయానికి తీసుకెళ్లే పూజా సామగ్రిని ఇంటిలోని కుటుంబ సభ్యులు మంగళవారం సిద్ధం చేశారు. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలోనూ ఇదే తీరుగా మండమెలిగె పూజలు నిర్వహిస్తారు. ఊరంతా కళకళ.. మండమెలిగె పండుగకు ఇంటి ఆడపడుచులు, ఇతర చుట్టాలను ఇళ్లకు పిలవడం(కేకేయడం) ఇక్కడి ఆదివాసీల ఆనవాయితీ. ప్రస్తుతం మేడారంలో ఏ ఇళ్లు చూసినా చుట్టాలతో కళకళలాడుతోంది. ఇళ్లన్నీ నూతన శోభతో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడపడుచును జాతర ముగిసిన తరువాతే తిరిగి అత్తారింటికి పంపిస్తామని గ్రామస్తులు తెలిపా రు. అత్తారింటికి పంపేటప్పుడు అల్లుడు, కూ తురు, వారి పిల్లలకు బట్టలు, అమ్మవారి ప్రసాదం(బెల్లం) ఇచ్చి సాగనంపుతారు. -
అడవి తల్లి ఒడిలో ఆదివాసీ పండగ
ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే నాగోబా జాతరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 19 నుంచి 27 వరకు జరిగే ఈ జాతరలో తమ ఆరాధ్య దైవమైన నాగోబాను ఘనంగా పూజించేందుకు ఆదివాసీలు సిద్ధమయ్యారు. ఇందుకోసం కేస్లాపూర్‌లోని నాగోబా (శేష నాగు) ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆదిలాబాద్‌తో పాటు మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే వివిధ తెగల ఆదివాసీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ జాతరలో ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్నీ విశేషాలే. జాతర సందర్భంగా కేస్లాపూర్ అటవీ ప్రాంతం జనసంద్రం అవుతుంది. పగలు రాత్రి ప్రత్యేక పూజలతో మార్మోగుతుంది. చుట్టపక్కల వందలాది దుకాణాలు వెలుస్తాయి. ఎక్కడెక్కడో నుంచి వచ్చే ఆదివాసీలంతా ఒక చోటికి చేరిన సందర్భంగా మంచిచెడ్డ మాట్లాడుకుంటారు. పెళ్లిళ్లు కూడా నిశ్చయమౌతుంటాయి. ఏడూర్లు తిరుగుతారు ఒక ప్రణాళిక బద్ధంగా ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులంతా కేస్లాపూర్‌లోని పటేల్ నివాసం వద్ద సమావేశం అవుతారు. అన్ని అంశాలు చర్చించాక జాతరపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎడ్లబండి (ఛకడ)లో కటోడా (పూజారి), ప్రధాన్ (పూజలకు సలహాదారుడు)లు కలిసి ముందుగా మహాపూజలకు అవసరమైన కుండల తయారీకి కుమ్మరులకు ఆదేశం ఇస్తారు. అనంతరం ఏడు రోజుల పాటు కటోడా, ప్రధాన్‌లు కలిసి ఎడ్ల బండ్లపై మేస్రం వంశీయులున్న ఏడు గ్రామాలను సందర్శిస్తారు. జాతర నిర్వహణపై కబూర్ (ప్రచారం) అందిస్తారు. గోదావరి జలయాత్ర నాగోబాను అభిషేకించేందుకు గోదావరి నది నుంచి జలాలను తీసుకొస్తారు. అందుకోసం సుమారు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదికి కాలినడకన వెళతారు. ఈ మార్గాన్ని రూపొందించేందుకు మరోమారు సమావేశమవుతారు. ఎప్పుడూ ఒకే దారిలో కాకుండా, ఏటా ఒక్కో ప్రాంతం నుంచి ఈ జల యాత్ర సాగుతుంది. ఈసారి నార్నూర్ -జైనూర్ - సిర్పూర్ - జన్నారం మండలాల మీదుగా హస్తిన సమీపంలోని మడుగు వద్ద ఉన్న గోదావరి నదికి చేరుకుంటారు. వెంట తీసుకువెళ్లిన ఉప్పుడు బియ్యాన్ని వండుకుని నైవేద్యం (సేసా)న్ని పెట్టి, సామూహిక భోజనాలు చేసిన అనంతరం గంగా జలాన్ని తీసుకుని నాగోబా ఆలయానికి కాలినడకన బయలు దేరుతారు. ఇంద్రాదేవికి పూజలు తిరుగు ప్రయాణంలో ఆచారం ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నెలకొని ఉన్న ఇంద్రా దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈసారి ఈనెల 15న ఇంద్రా దేవి పూజలు జరుగుతున్నాయి. అదేరోజు కేస్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న మర్రిచెట్టు (వడమర్ర)కు చేరుకుంటారు. మరుసటి రోజు రాత్రి... చనిపోయిన మేస్రం వంశీయుల పేరుతో తూం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మూడు రోజుల పాటు వివిధ రకాల పూజలు జరుపుతారు. అనంతరం ఈనెల 19న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలు.. డోల్, పెప్రే, కాలికోంల చప్పుళ్ల నడుమ గంగా జలంతో ఆలయానికి చేరుకుంటారు. కొత్త కోడళ్ల పరిచయాలు మేస్రం వంశీయుల ఆడ పడుచులు, అల్లుళ్లు ముందుండి ఈ ప్రత్యేక పూజలన్నీ చేయిస్తారు. మహాపూజ రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మేసం వంశీయుల కుటుంబాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న కోడళ్లను మేస్రం వంశం పెద్దలకు పరిచయం (బెట్టింగ్) చేయించి నాగోబాను చూపుతారు. వారి సంప్రదాయం ప్రకారం ఈ బెట్టింగ్ జరిగాకే ఆ మహిళలు నాగోబాకు పూజలు చేయడానికి ఆర్హులవుతారు. ఇరవై రెండు పొయ్యిలు మహా పూజలు, బెట్టింగ్‌ల మరుసటి రోజు ఈనెల 20న ఆలయం వెనుక ఉన్న పేర్సపెన్ (పెద్ద దేవత) కు పూజలు చేస్తారు. ఈ పూజలను కేవలం పురుషులు మాత్రమే నిర్వహిస్తారు. పూజలు జరుగుతున్న సమయంలో ప్రధాన్‌లు సాంప్రదాయ వాయిద్యాలను వాయిస్తుంటారు. తర్వాత మట్టితో భాన్ దేవత విగ్రహాలను తయారు చేసి పూజలు చేస్తారు. 21న గోవాడ్ (ప్రత్యేక కట్టడం) వద్ద మేస్రం వంశీయుల్లో ఉన్న 22 కితల (మేస్రం వంశంలోనే వివిధ వర్గాలు) వారిగా సంప్రదాయ పూజలు చేస్తారు. కుండల్లో వంటకాలను తయారు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. గోవాడ్‌లో కితల వారీగా 22 పొయ్యిలు ఏర్పాటు చేసుకుని సాంప్రదాయ వంటకాలను తయారు చేసి, కితల వారిగా సహపంక్తి భోజనాలు చేస్తారు. బేతాల్ నృత్యాలు దర్బార్ అనంతరం ఆదివాసీల బేతాల్ పూజ ఉంటుంది. కులపెద్దలు బేతాల్ నృత్యాలు చేస్తారు. కర్రసామును పోలిన ఈ నృత్యాలు అందరిని అలరిస్తాయి. అనంతరం మండగాజిలింగ్ పూజలతో నాబోబా జాతర ముగింపు జరుగుతుంది. ఈ మండగాజిలింగ్లో జాతరకు వచ్చిన కానుకలు, నైవేద్యాలను కితల వారిగా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక నృత్యాలతో జాతర ముగుస్తుంది. జాతరకు వెళ్లాలంటే.. ఆదిలాబాద్ నుంచి (32 కి.మీ) ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి 44 వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్ మండల కేంద్రం నుంచి, ఇంద్రవెల్లి కంటే ఐదు కిలో మీటర్ల ముందు ముత్నూర్ నుంచి కేస్లాపూర్‌కు రోడ్డు సౌకర్యం ఉంది. -
మహా సంబురం
వనమెల్లా జనం..నిలువెల్లా బంగారం గిరి‘జన’జాతరకు వందనం సల్లంగ సూడు తల్లీ.. మేడారం.... గిరిజన సంప్ర దాయానికి నిలువెత్తు ప్రతిరూపం. ఆ అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. రాజరికపు పాలనపై దండెత్తిన చారిత్రక నేపథ్యం. పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన ధీరత్వం ఆ నేల సొంతం. కాకతీయుల పాలనపై కత్తిదూసిన సమ్మక్క, సారలమ్మలు అడవి బిడ్డల ఆరాధ్య దైవాలు. రెండేళ్ల కోసారి ఈ ఇలవేల్పులను కొలిచే జాతరే మేడారం ప్రత్యేకం. అరవై గుడిసెల సమాహారం ఆ నాలుగురోజుల్లో మహానగరమవుతుంది. కోటి అడుగుల చప్పుడవుతుంది. కోయగూడెం ఎర్రరేగడి మట్టితో సింగారించుకుంటుంది. ఒక్కో రోజు ఒక్కో సన్నివేశానికి సంతకమవుతుంది. ఊరేగింపుగా వచ్చే జనంతో అక్కడ ఓ ఉద్వేగం. ఆరాధ్య దైవాలను మొక్కుకునే తీరు ఓ మహా సన్నివేశం. సబ్బండ వర్ణాలు ఒక్కచోట చేరే క్షణం అనిర్వచనీయం. కనిపించని దైవాల కోసం కదిలివచ్చే జనంతో జంపన్న వాగు జనసంద్రమవుతుంది. అమ్మల కోసం ఊరూ వాడా కదిలొస్తుంది. చిలకల గుట్టవైపు పరుగులు తీసే జనంతో కిక్కిరిసి పోతుంది. శివ్వాలెత్తే శివసత్తుల పూనకాలతో చెట్టూ పుట్టా ఊగిపోతాయి. అడవిని ముద్దాడుతూ లక్షలాది అడుగులు వెంట నడుస్తాయి. సామూహికత సాక్షాత్కరిస్తుంది. దుబ్బ కొట్లాడుతుంది... సంప్రదాయం తిరుగాడుతుంది. నెత్తుటి జ్ఞాపకాలు కళ్లెదుటే కనబడుతాయి... పురా ఆత్మలు సంభాషిస్తాయి. నెమలినార చెట్టు నేనున్నానంటూ పలకరిస్తుంది. కొంగు బంగారం కొలువుదీరుతుంది. కుంకుమ భరిణె ఇంటింటి చుట్టమై వస్తుంది. దండ కారణ్యం దండం పెడుతుంది. పసుపు వర్ణ శోభితమై పీతాంబ రమవుతుంది. బెల్లం నైవేద్యమ వుతుంది. అమ్మల రాక చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్ముతుంది. భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. జయజయ ధ్వానాలు మార్మోగుతాయి. సల్లంగా సూడు తల్లీ అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతాయి. - మేడారం నుంచి పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్ మొదటి రోజు సారలమ్మ ఆగమనం... కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. సమ్మక్క కూతురైన సారమ్మ నివాసం కన్నెపల్లి. సారలమ్మ ఫిబ్రవరి 12న బుధవారం సాయంత్రం గద్దె వద్దకు చేరుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కన్నెపల్లి నుంచి సారలమ్మ వడ్డెలు(పూజారులు) మేడారంలోని గద్దెల వద్దకు వచ్చి, ముగ్గులు వేసి మళ్లీ కన్నెపల్లిలోని పూజా మందిరానికి వెళ్తారు. అక్కడ రెండుగంటలపాటు గోప్యంగా పూజలు నిర్వహిస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వేలమంది భక్తులు తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ ప్రణామాలతో వరం పడతారు. దేవత రూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చిన పూజారులు వరం పడుతున్న వారి పైనుంచి నడిచి వెళతారు. ఆ సారలమ్మే తమపై నుంచి వెళుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని తీసుకొస్తున్న వడ్డెను దేవదూతగా భావిస్తారు. గ్రామ మహిళలు మంగళహారతులు ఇచ్చి, నీళ్లారబోసి కొబ్బరికాయలు కొడుతూ మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. అక్కడినుంచి సారలమ్మ జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు చేరుకుంటారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. సారలమ్మ సహా వీరి ముగ్గురికి అక్కడ వడ్డెలు ప్రతిష్టిస్తారు. రెండో రోజు సమ్మక్క ఆగమనం... జాతరలో రెండో రోజైన గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచే కార్యక్రమం మొదలవుతుంది. మొదట వడ్డెలు చిలకలగుట్టకు వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేస్తారు. సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(పసిడి కుండలు)ను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. మళ్లీ చిలకలగుట్టకు వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమ్మక్కను గద్దెలపైకి తీసుకు వచ్చే ప్రక్రియ మొదలవుతుంది. చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధాన ఘట్టం ఇదే. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలుకుతూ చిలకలగుట్ట వద్దకు వెళతారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో ఒక్క ఉదుటున పరుగులు తీస్తాడు. వందల మంది పోలీసులు అతడికి రక్షణగా ఉంటారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్చి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్కకు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. ప్రత్యేక పూజల అనంతరం కుంకుమ భరిణెను గద్దెలపైకి చేర్చుతారు. మూడో రోజు గద్దెలపై తల్లులు... గద్దెలపై ఆసీనులైన సమ్మక్క-సారలమ్మలు మూడోరోజు శుక్రవారం అశేష భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు. నిలువుదోపిడీ ఇస్తారు. వన దేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరెసారెలు పెడతారు. ఒడి బియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం(బెల్లం) నైవేద్యంగా పెడతారు. కట్టలు తెంచుకున్న భక్తితో ఉరకలెత్తుతున్న జనంతో మేడారం పరిసరాలు సందడిగా మారుతాయి. ఈ రోజంతా లక్షలాది మంది గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటారు. వీరితో గద్దెల ప్రాంగణాలు జనసంద్రమవుతాయి. జాతరలో మేడారానికి ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. నాలుగో రోజు దేవతల వన ప్రవేశం... నాలుగో రోజు సమ్మక్కను చిలకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. మొక్కులు తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచ్చిన సమ్మక్క-సారలమ్మలు నాలుగో రోజు శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తారు. దేవతలను గద్దెలపైకి చేర్చేక్రమంలో రక్షణ కల్పించిన విధంగానే పోలీసులు వన ప్రవేశం సమయంలోనూ కట్టుదిట్టమైన రక్షణతో వనాలకు సాగనంపుతారు. సమ్మక్కతల్లి చిలకలగుట్టపైకి, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లిన అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు. దైవాన్ని తెచ్చే చేతులు ..ఆ ఇద్దరు వీరే! నిష్ఠతో ఒక్కపొద్దు ఉంట... గుడిమెలిగె పండుగతో సమ్మక్క-సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. జాతర మొదలయ్యేది మండెమెలిగె పండుగతోనే. ఈ పండుగ రోజు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్ఠలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు తీసుకుంటాం. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటాం. సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహ అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. మండెమెలిగె పండుగ నాటి నుంచే నిష్ఠతో ఒక్క పొద్దు ఉంటా ను. ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది. - కొక్కెర కృష్ణయ్య, సమ్మక్క ప్రధాన వడ్డె ఏం జరుగుతుందో తెలియదు... సారలమ్మను గద్దెకు తీసుకురావడానికి రెండు రోజుల ముందు నుంచే అదోలా ఉంటుంది. సరిగ్గా వారం రోజుల ముందు.. మండమెలిగె పండుగ నుంచి సారలమ్మ పూనినట్లుగా అనిపిస్తుంటుంది. సారలమ్మను తీసుకెళ్లేరోజు ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సమ్మక్క ఆలయంలో సారలమ్మను చేర్చి పూజలు చేస్తున్న సమయంలో కొంత తెలివి వస్తుంది. మళ్లీ అక్కడి నుంచి గద్దెపైకి చేర్చే సమయానికి తన్మయత్వంలో ఉంటాను. గద్దెలపై ప్రతిష్టించిన తర్వాత నెమ్మదినెమ్మదిగా మైకం వీడుతుంది. - కాక సారయ్య, సారలమ్మ ప్రధాన వడ్డె