మముగను తల్లీ శీత్లా !
సంస్కృతి
∙ ప్రతి తండాలో దాటుడు పండుగ – విత్తనాలు వేయగానే పండుగకు శ్రీకారం
∙ సమృద్ధిగా పంటలు పండాలని మొక్కులు
∙ గిరిజన సాంప్రదాయాల మధ్య అడవి తల్లికి పూజలు
తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి లంబాడాల ఆచార వ్యవహారాలు ప్రత్యేకం. అడవిలో ప్రతి చెట్టు, పుట్ట, రాయి. గుట్ట అన్నీ వారికి ఆరాధ్య దైవాలే.. అంతా అ దేవుడిపైనే భారం. బిడ్డ పుట్టిన నాటి నుండి పెరగడం, పెళ్లి ఇలా అన్ని శుభకార్యాలూ ఆ అమ్మవారి చలువతోనే జరుగుతాయని నమ్మకం. చివరకు చనిపోయినా.. ప్రత్యేక పూజలు చేస్తారు.
తొలకరి జల్లులు పడగానే పుడమి తల్లి ఒడిలో విత్తనాలు వేసి, అవి సక్రమంగా మొలకెత్తాలని, పశువులు పరిపుష్ఠిగా ఉండి వ్యవసాయానికి ఉపయోగపడాలని. పంటలు సమృద్ధిగా పండాలని శీత్లా భవాని అమ్మవారిని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాడం, శ్రావణ మాసాల్లోని మంగళవారంలో జరుపుకునే శీత్లా భవాని(దాటుడు పండుగ)పండుగ గిరిజన తండా పండుగల్లో కీలకమైనది. పశువులకు, మనుషులకు, పంట చేలకు వ్యాధులు రాకూడదని, ఏ దుష్టశక్తి కూడా తమ వైపు చూడకూడదని శీత్లా భవాని అమ్మవారిని కోరుతూ పండుగ జరుపుకుంటారు.
పునాస పంటలతో పచ్చటి రంగేసుకున్న పుడమి తల్లి ఒడిలో రంగురంగుల దుస్తులు, కళ్లు మిరిమిట్లు గొలిపే అద్దాల ముసుగులు, ముంజేతి గాజులు, ఘల్లుఘల్లుమనే కాళ్ల కడియాలతో అందంగా అలంకరించుకొని యువతీయువకులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ శీత్లా భవాని పండుగ.
వేడుక ఇలా..
శీత్లా భావాని అమ్మవారికి మంగళవారం ఉత్సవాలు జరుపుతారు. దీనిని గొడ్లదాటుడు పండగ అని కూడ పిలుస్తారు. తండా పెద్ద నిర్ణయం ప్రకారం పండుగకు ఒక రోజు ముందుగా రాత్రి వాసిడో.. వాసిడో..(పాత గుగ్గిళ్లు) అని కేకవేస్తూ ఒక వ్యక్తి తండాలోని వీధి వీధి తిరుగుతాడు. అంటే రేపు పండుగ చేయాలని అర్థం. తండా శివారులో రావి, వేప, మోదుగు చెట్టుకింద ఏడు రాతి బండలను నిలువున పాతి పెట్టి (అమ్మవారి ఏడు ప్రతి రూపాలు ఏడు బండలు) ఎర్రటి మట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు. తమ వ్యవసాయ భూముల్లో పండిన ధాన్యాలు మక్కలు, బొబ్బర్లు, సెనగలు కలిపి గుడాలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని తీసుకొని గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిపై నైవేద్యం పెట్టుకొని నృత్యాలు చేసుకుంటూ శీత్లా భవాని పండుగ జరిపే ప్రాంతాలకు వస్తారు.
నంతరం అక్కడ ఉన్న కుల పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. శీత్లా భవానికి వేట బలి ఇస్తారు. రక్తంలో ధాన్యాలను కలిపి పశువుల పై చల్లుతారు. అనంతరం గిరిజన మహిళలు శీత్లా భవానికి తెచ్చిన నైవేద్యాలను ఒక దగ్గర పెట్టి లంబాడీ భాషలో గేయాలు అలపిస్తూ ఆనందంగా నృత్యాలు చేస్తారు.
– భిక్షం, సాక్షి, సిద్ధిపేట