సంప్రదాయ డప్పులు వాయిస్తూ పాటలు పాడుతున్న ఆదివాసీలు
సాక్షి, మంచిర్యాల: మైదాన ప్రాంతవాసులతో పోలిస్తే ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. పుట్టుక, పెళ్లి, చావు.. ఇలా అన్నింటా వారికి ప్రత్యేక జీవనశైలి ఉంది. సాధారణంగా ఎవరైనా కాలం చేస్తే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, తెలిసినవారితో కలసి అంతిమ వీడ్కోలు పలికి ఇల్లు చేరుతుంటారు. కానీ, ఈ వ్యవహారంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని గోండు తెగ సంప్రదాయం వేరు. మృతదేహం చితిలో పూర్తిగా కాలిపోయి.. బూడిదగా మారేవరకూ(నీర్‌పూజ) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అర్ధరాత్రి తర్వాత కాష్టం చుట్టూ తిరుగుతూ సంప్రదాయ వాయిద్యాలు, డప్పులు మోగిస్తూ, ప్రత్యేక గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తారు.
చనిపోయినవ్యక్తిని ఈ పాటల్లో కీర్తిస్తూ స్వర్గప్రాప్తి కలగాలని కోరుతారు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చి బతికి చనిపోయినవారి చివరి మజిలీలో ఇదే ఆఖరిఘట్టంగా భావించి ‘ఆత్మకు శాంతి’ చేకూరేలా ఆడి పాడి ఈ క్రతువు పూర్తిచేస్తారు. ఇలా చేస్తే చనిపోయినవారి ఆత్మ స్వర్గంలో శాంతిస్తుందని గిరిజనుల నమ్మకం. ఈ తంతులో మహిళలు తప్ప కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఆడి పాడే సమయంలో అక్కడే మేకను బలి ఇస్తారు. వంట చేసుకుని సంప్రదాయ సంగీతం మధ్య ఆడుతూపాడుతూ అక్కడే భోజనం చేస్తారు. ఇదంతా సూర్యోదయం వరకు కొనసాగుతుంది. అనాదిగా ఆదివాసీల్లో ఈ ఆచారం కొనసాగుతోంది.
తాజాగా... ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయిలో ఆత్రం బొజ్జు పటేల్ మరణించారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘనంగా అంతిమయాత్ర పూర్తి చేశారు. తర్వాత అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు సంప్రదాయ తంతు నిర్వహించారు. కాగా, దేహాన్ని కాల్చకుండా మట్టిలో పూడిస్తే మాత్రం ఈ తరహా కార్యక్రమాలు ఉండవు.
అనాదిగా వస్తున్న ఆచారం
చితిలో కాలిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం చేస్తాం. అనాదిగా ఈ ఆచారం పాటిస్తున్నాం. ఇలా చేస్తే చనిపోయిన వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని నమ్మకం.
– మెస్రం షేకు, దబోలి, జైనూరు మండలం, ఆసిఫాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment