అడవి తల్లి ఒడిలో ఆదివాసీ పండగ | Wild tribal festival in the lap | Sakshi
Sakshi News home page

అడవి తల్లి ఒడిలో ఆదివాసీ పండగ

Published Mon, Jan 12 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

అడవి తల్లి ఒడిలో  ఆదివాసీ పండగ

అడవి తల్లి ఒడిలో ఆదివాసీ పండగ

ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే నాగోబా  జాతరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 19 నుంచి 27 వరకు జరిగే ఈ జాతరలో తమ ఆరాధ్య దైవమైన నాగోబాను ఘనంగా పూజించేందుకు ఆదివాసీలు సిద్ధమయ్యారు. ఇందుకోసం కేస్లాపూర్‌లోని నాగోబా (శేష నాగు) ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆదిలాబాద్‌తో పాటు మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే వివిధ తెగల ఆదివాసీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనే  ఈ జాతరలో ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్నీ విశేషాలే.
 
జాతర సందర్భంగా కేస్లాపూర్ అటవీ ప్రాంతం జనసంద్రం అవుతుంది. పగలు రాత్రి ప్రత్యేక పూజలతో మార్మోగుతుంది. చుట్టపక్కల వందలాది దుకాణాలు వెలుస్తాయి. ఎక్కడెక్కడో నుంచి వచ్చే ఆదివాసీలంతా ఒక చోటికి చేరిన సందర్భంగా మంచిచెడ్డ మాట్లాడుకుంటారు. పెళ్లిళ్లు కూడా నిశ్చయమౌతుంటాయి.
 
ఏడూర్లు తిరుగుతారు
 
ఒక ప్రణాళిక బద్ధంగా ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులంతా కేస్లాపూర్‌లోని పటేల్ నివాసం వద్ద సమావేశం అవుతారు. అన్ని అంశాలు చర్చించాక జాతరపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎడ్లబండి (ఛకడ)లో కటోడా (పూజారి), ప్రధాన్ (పూజలకు సలహాదారుడు)లు కలిసి ముందుగా మహాపూజలకు అవసరమైన కుండల తయారీకి కుమ్మరులకు ఆదేశం ఇస్తారు. అనంతరం ఏడు రోజుల పాటు కటోడా, ప్రధాన్‌లు కలిసి ఎడ్ల బండ్లపై మేస్రం వంశీయులున్న ఏడు గ్రామాలను సందర్శిస్తారు. జాతర నిర్వహణపై కబూర్ (ప్రచారం) అందిస్తారు.
 
గోదావరి జలయాత్ర

నాగోబాను అభిషేకించేందుకు గోదావరి నది నుంచి జలాలను తీసుకొస్తారు. అందుకోసం సుమారు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదికి కాలినడకన వెళతారు. ఈ మార్గాన్ని రూపొందించేందుకు మరోమారు సమావేశమవుతారు. ఎప్పుడూ ఒకే దారిలో కాకుండా, ఏటా ఒక్కో ప్రాంతం నుంచి ఈ జల యాత్ర సాగుతుంది. ఈసారి నార్నూర్ -జైనూర్ - సిర్పూర్ - జన్నారం మండలాల మీదుగా హస్తిన సమీపంలోని మడుగు వద్ద ఉన్న గోదావరి నదికి చేరుకుంటారు. వెంట తీసుకువెళ్లిన ఉప్పుడు బియ్యాన్ని వండుకుని నైవేద్యం (సేసా)న్ని పెట్టి, సామూహిక భోజనాలు చేసిన అనంతరం గంగా జలాన్ని తీసుకుని నాగోబా ఆలయానికి కాలినడకన బయలు దేరుతారు.
 
ఇంద్రాదేవికి పూజలు

తిరుగు ప్రయాణంలో ఆచారం ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నెలకొని ఉన్న ఇంద్రా దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈసారి ఈనెల 15న ఇంద్రా దేవి పూజలు జరుగుతున్నాయి. అదేరోజు కేస్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న మర్రిచెట్టు (వడమర్ర)కు చేరుకుంటారు. మరుసటి రోజు రాత్రి... చనిపోయిన మేస్రం వంశీయుల పేరుతో తూం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మూడు రోజుల పాటు వివిధ రకాల పూజలు జరుపుతారు. అనంతరం ఈనెల 19న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలు.. డోల్, పెప్రే, కాలికోంల చప్పుళ్ల నడుమ గంగా జలంతో ఆలయానికి చేరుకుంటారు.

కొత్త కోడళ్ల పరిచయాలు

మేస్రం వంశీయుల ఆడ  పడుచులు, అల్లుళ్లు ముందుండి ఈ ప్రత్యేక పూజలన్నీ చేయిస్తారు. మహాపూజ రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మేసం వంశీయుల కుటుంబాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న కోడళ్లను మేస్రం వంశం పెద్దలకు పరిచయం (బెట్టింగ్) చేయించి నాగోబాను చూపుతారు. వారి సంప్రదాయం ప్రకారం ఈ బెట్టింగ్ జరిగాకే ఆ మహిళలు నాగోబాకు పూజలు చేయడానికి ఆర్హులవుతారు.
 
ఇరవై రెండు పొయ్యిలు

మహా పూజలు, బెట్టింగ్‌ల మరుసటి రోజు ఈనెల 20న ఆలయం వెనుక ఉన్న పేర్సపెన్ (పెద్ద దేవత) కు పూజలు చేస్తారు. ఈ పూజలను కేవలం పురుషులు మాత్రమే నిర్వహిస్తారు.  పూజలు జరుగుతున్న సమయంలో ప్రధాన్‌లు సాంప్రదాయ వాయిద్యాలను వాయిస్తుంటారు. తర్వాత మట్టితో భాన్ దేవత విగ్రహాలను తయారు చేసి పూజలు చేస్తారు. 21న గోవాడ్ (ప్రత్యేక కట్టడం) వద్ద మేస్రం వంశీయుల్లో ఉన్న 22 కితల (మేస్రం వంశంలోనే వివిధ వర్గాలు) వారిగా సంప్రదాయ పూజలు చేస్తారు. కుండల్లో వంటకాలను తయారు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. గోవాడ్‌లో కితల వారీగా 22 పొయ్యిలు ఏర్పాటు చేసుకుని సాంప్రదాయ వంటకాలను తయారు చేసి, కితల వారిగా సహపంక్తి భోజనాలు చేస్తారు.
 
బేతాల్ నృత్యాలు

దర్బార్ అనంతరం ఆదివాసీల బేతాల్ పూజ ఉంటుంది. కులపెద్దలు బేతాల్ నృత్యాలు చేస్తారు. కర్రసామును పోలిన ఈ నృత్యాలు అందరిని అలరిస్తాయి. అనంతరం మండగాజిలింగ్ పూజలతో నాబోబా జాతర ముగింపు జరుగుతుంది. ఈ మండగాజిలింగ్‌లో జాతరకు వచ్చిన కానుకలు, నైవేద్యాలను కితల వారిగా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక నృత్యాలతో జాతర ముగుస్తుంది.
 
జాతరకు వెళ్లాలంటే..

ఆదిలాబాద్ నుంచి (32 కి.మీ) ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి 44 వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్ మండల కేంద్రం నుంచి, ఇంద్రవెల్లి కంటే ఐదు కిలో మీటర్ల ముందు ముత్నూర్ నుంచి కేస్లాపూర్‌కు రోడ్డు సౌకర్యం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement