విజయవాడ లీగల్ : అక్షర బుద్ధులు నేర్పాల్సిన టీచరే కీచకుడైనట్లు దాఖలైన కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 9 లక్షల జరిమానా విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి (ప్రత్యేక న్యాయస్థానం) ఎ.గిరిధర్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా, ఉయ్యూరు నగర పంచాయతీలో నిందితుడు పోరంకి యతిరామశర్మ(52) నివాసముంటూ పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామ శివారు ముదిరాజుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినుల (10) పట్ల నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు.
దీన్ని ఓ విద్యార్థి గమనించి గత ఏడాది సెప్టెంబర్ 8న పెద్దవాళ్ళకు తెలియజేశాడు. విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లగా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున సి.ఎం.ఎస్. పోలీసులు 16 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీలు గడ్డం రాజేశ్వరరావు, సాదు ప్రసాదు విచారణ నిర్వహించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పుచెప్పారు. జరిమానాలోని ఏడు లక్షలను నలుగురు విద్యార్థినులు ఒక్కొక్కరికి రు.1,75,000 ఇవ్వాలని తీర్పు చెప్పారు. నిందితుడు సెప్టెంబర్ 30 లోపు జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అక్టోబర్ 31 లోపు ప్రభుత్వం నిందితుని ఆస్తులను జప్తు చేసి కోర్టులో చెల్లించాలని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.
కీచక హెచ్‌ఎంకు ఏడేళ్ల జైలు శిక్ష
Published Mon, Aug 29 2016 7:40 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
Advertisement
Advertisement