అనంతపురం : రాజధాని భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ గురువారం అనంతపురంలో నిప్పలు చెరిగారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు భూపిశాచిలా వ్యవహరిస్తూ రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్కు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించమని.... ప్రత్యేక హోదానే కావాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ప్రత్యేక హోదాపై ఆగస్టు 22, 23 తేదీలల్లో కడపలో రాష్ట్ర స్థాయి సభలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు మండలాలను ప్రకటించాలని ఆయన చంద్రబాబు సర్కార్ను డిమాండ్ చేశారు.
అలాగే కరువు పీడిత గ్రామాలకు నీటిని సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రాయలసీమలోని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చార్జీషీటులో చేర్చినందున నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు. దోషులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలన్నారు.
ప్రత్యేక హోదాపై ఆగస్టు 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న బంద్కు తాము సానుకూలంగానే ఉన్నామన్నారు. వామపక్ష పార్టీలతో చర్చించి ఆ తర్వాత సంఘీభావం ప్రకటిస్తామని కె.రామకృష్ణ చెప్పారు.