రగిలిన 'గర్జన' | kaapu garjana for reservations | Sakshi
Sakshi News home page

రగిలిన 'గర్జన'

Published Mon, Feb 1 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

రగిలిన 'గర్జన'

రగిలిన 'గర్జన'

  • ఉవ్వెత్తున కాపు రిజర్వేషన్ ఉద్యమం
  • రాస్తారోకో, రైల్‌రోకోలతో అట్టుడికిన తూర్పు
  • ప్రత్యక్ష ఆందోళనలోకి లక్షలాదిమంది.. ఆగ్రహజ్వాలలకు రత్నాచల్ దగ్ధం
  • రెండు పోలీస్‌స్టేషన్లు, పలు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఫ్లెక్సీలకు నిప్పు
  • ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించిన ఉద్యమకారులు
  • పొద్దుపోయే వరకు ఆందోళన.. ఉద్యమానికి తాత్కాలిక విరామం
  • నేటి సాయంత్రం వరకు గడువు.. లేదంటే ఆమరణ దీక్ష: ముద్రగడ

  • ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం భగభగమండింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఆదివారం జరిగిన ‘కాపు ఐక్య గర్జన’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలకు ‘రత్నాచల్’ రైలుతో పాటు పదుల సంఖ్యలో కార్లు, వందలాది ద్విచక్ర వాహనాలు, రెండు పోలీసు స్టేషన్లు దగ్ధమయ్యాయి. సభకు హాజరు కానీయకుండా పలుచోట్ల ఆటంకాలు కల్గించడం, మార్గమధ్యంలో గంటల తరబడి ఆపి వెనక్కు పంపే ప్రయత్నం చేయడం ఆందోళనకారులలో అసహనాన్ని రెట్టింపుచేసింది.

    బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కగానే ప్లేటు ఫిరాయించడం కాపుల్లో ఆగ్రహావేశాలను రగిలిం చింది. సభకు హాజరైన లక్షలాది మంది ఉద్యమకారులలో అది ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రత్యక్ష ఆందోళనకు దిగుదామని ఐక్యగర్జన సారథి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునివ్వగానే వారంతా సీఎంకు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ జాతీయరహదారిపైకి, రైలు పట్టాలపైకి ఉత్సాహంగా చేరిపోయారు.

    వేలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. విజయవాడ - విశాఖ మధ్య రైళ్లు ఆగిపోయాయి. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం, రత్నాచల్ ఆందోళనకారులపైకి దూసుకురావడంతో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో వారు రైలును దగ్ధం చేయడమే కాక 2 పోలీస్‌స్టేషన్లనూ అగ్నికి ఆహుతి చేశారు. అనేక వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాత్రి 9.30 గంటల సమయంలో ముద్రగడ ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోతే నేటి సాయంత్రం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన అల్టిమేటమ్ జారీ చేశారు.
     
    (తుని నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
    రాష్ర్టంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం భగ్గుమంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక నిర్ణయంతో ఐక్య గర్జన ఉగ్ర రూపం దాల్చింది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు, పదుల సంఖ్యలో కార్లు, వందలాది ద్విచక్ర వాహనాలు, రెండు పోలీసు స్టేషన్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తూర్పుగోదావరి జిల్లాకు అదనపు బలగాలను రప్పిస్తుండగా ముద్రగడ రాష్ట్ర ప్రభుత్వానికి 24గంటల డెడ్‌లైన్ విధిస్తూ జాతీయ రహదారిపై దీక్షను తాత్కాలికంగా విరమించారు. వి.కొత్తూరుకు సమీపంలోని జాతీయ రహదారిపై రాత్రి 9.30 వరకు ధర్నా చేసిన ముద్రగడ సోమవారం సాయంత్రం వరకు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. లక్షలాదిమంది కార్యకర్తల ఆందోళనతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. విశాఖ, విజయవాడ వైపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తుని, అన్నవరం తదితర ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధించారు.

    అశేషంగా తరలి వచ్చిన జనం
    కాపుల రిజర్వేషన్ల సాధనకు ముద్రగడ ఆదివారమిక్కడికి సమీపంలోని వి.కొత్తూరు వద్ద నిర్వహించిన ఐక్య గర్జనకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, ఒంటరి కులస్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణమైన 80 ఎకరాల కొబ్బరి తోట ఆందోళనకారులతో కిటకిటలాడింది. ఉదయం పది గంటల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తింది. వేదిక వైపు దూసుకువచ్చే యువతను ఆపడం నిర్వాహకులకు కష్టతరమైంది. సభ ఒంటి గంటకు ప్రా రంభం కావాల్సి ఉన్నా గంటకు పైగా ఆలస్యమైంది. ఈలోపు వేదిక ముందుకు యువత తోసుకురావడంతో మీడియా కోసం నిర్మించిన వేదికసైతం కూలిపోయింది. మైకులు మొరాయించాయి. వేదికపైన ఉన్న వారు ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాక గందరగోళం ఏర్పడింది. ఈదశలో మైకు తీసుకున్న ముద్రగడ సభికులను ప్రశాంతంగా ఉండాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది.  

    ముద్రగడ ఆకస్మిక నిర్ణయం...
    ముద్రగడ పద్మనాభం సుదీర్ఘంగా మాట్లాడతారన్న దానికి భిన్నంగా కేవలం 8 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించి సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు.  చాలా ప్రశాంతంగా ప్రసంగాన్ని మొదలు పెట్టిన ముద్రగడ పదండి పట్టాలపైకి అంటూ వేదిక దిగి పోవడంతో మరెవ్వరికీ మాట్లాడడానికి అవకాశమే లేకుండా పోయింది. వేదికపై అప్పటికే వీహెచ్, జక్కంపూడి విజయలక్ష్మి, కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు. వేదికపైకి పోయేందుకు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కె.కన్నబాబు తదితరులు ఉద్యుక్తులవుతుండగానే జైజై నినాదాల మధ్య ముద్రగడ జాతీయ రహదారి వైపు బయలుదేరారు.

    అంతటా ఉద్రిక్తత తొక్కిసలాట
    జరుగుతుంది ఏమిటో అర్థం కాక సభికులు హడావిడి పడ్డారు. అటూఇటూ ఉరుకులు పరుగులు పెట్టారు. ఏవైపు చూసినా చీమల దండుల్లా జనం జాతీయ రహదారి వైపు వెళ్లి రైలు పట్టాల వైపు పరుగులు తీశారు. అప్పటికే ముద్రగడ అక్కడికి సమీపంలోని రైలు పట్టాలపై కుటుంబ సభ్యులతో బైఠాయింపు చేయడం, జనం పట్టాలపైకి వచ్చి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత ముద్రగడ తిరిగి జాతీయ రహదారిపైకి వచ్చి ఓ ఆటోపైన కూర్చుండిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఏపార్టీలో చేరనని, కాపుల్ని బీసీలో చేర్చే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. పోలీసులు కాల్పులు జరిపితే శవాలతో నైనా రోడ్డుపై బైఠాయిస్తానని ప్రకటించారు. రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఇక్కడేనన్నారు. ఈ దశలో రోడ్డుపై బైఠాయించిన యువకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఓట్లు మావీ, అధికారం మీదా, ఇది ఆకలి పోరాటం, ఆఖరి పోరాటం అంటూ నినాదాలు చేశారు.

    రాత్రి దాకా కొనసాగిన ఆందోళన
    రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళన కొనసాగింది. ఈలోపు ఆందోళనకారులు ఆగ్రహావేశాలతో తుని రూరల్, టౌన్ పోలీసు స్టేషన్లకు నిప్పు బెట్టారు. పోలీసు వాహనాలతో పాటు అక్కడ పార్క్ చేసిన ప్రైవేటు వాహనాలు సైతం దగ్ధమయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు తునిలో అక్కడక్కడా ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. దీంతో భీతావహులైన వ్యాపారులు తమ దుకాణాలను  మూసివేశారు. పరిస్థితి చేజారిపోతుండడంతో పోలీసులు తుని ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించారు.
     
    నేటి సాయంత్రం వరకు గడువు
    ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ముద్రగడ రాత్రి 9.30గంటల ప్రాంతంలో ప్రకటించారు. సోమవారం సాయంత్రంలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తిరిగి ఆమరణ దీక్ష మొదలుపెడతానని ముద్రగడ ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి అల్టిమేటమ్ అన్నారు. అప్పటికే రోడ్డుపై బైఠాయించి, వంటావార్పు మొదలు పెట్టిన యువకులు ముద్రగడ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement