రిజర్వేషన్‌లు సాధించుకుంటేనే భావితరాలకు భవిష్యత్తు
- కాపు ఉద్యమనేత ముద్రగడ
కిర్లంపూడి(జగ్గంపేట): ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని సాధించుకుంటేనే కాపుజాతి భావితరాల భవిష్యత్తు బాగుంటుందని కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అన్నారు. బుధవారం సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలు, ఏలేశ్వరం మండలం చినశంకర్లపూడి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కాపు యువత మోటారుసైకిళ్లపై ర్యాలీగా తరలివచ్చి ఈ నెల 26న నిర్వహించనున్న ‘చావో రేవో ఛలో అమరావతి’ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోసం కాపు జాతికి రిజర్వేషన్‌లు ఇస్తాం, ఏటా వెయ్యి కోట్లు ఇచ్చి ఆర్థికపరంగా ఆదుకుంటామని చెప్పి అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. హామీలు గుర్తు చేయడం కోసమే ఈ నెల 26న పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కర్నీడి వీరబాబు, కర్రి గవర్రాజు, ఓరుగంటి గోపాల, ఓరుగంటి పెదకాపు, బుద్దాల గంగాధర్, శివలంక నాగబాబు, పుప్పాల బాబులు, గోళ్ల నాగేశ్వరరావు, జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, తూము చినబాబు, చల్లా సత్యన్నారాయణ, గౌతు స్వామి తదితరులు పాల్గొన్నారు.